
నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 10 : రాష్ర్టాభివృద్ధిని జీర్ణించుకోలేకనే బీజేపీ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తూ పనికి రాని దద్దమ్మలుగా నిలుస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన వంద మందికి కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరవగా, వాటిని మండల పరిషత్ కార్యాలయం లో లబ్ధిదారులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి పనులను పలువురు కేంద్ర మంత్రులు చూసి అభినందిస్తున్నారని చెప్పారు. ఈ విషయాలను గ్రహించకుండా బీజేపీ నాయకులు ఇష్టారీతిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని రైతులందరూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని అన్నారు. దీనిని ఓర్వలేకనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమంటూ మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు, రైతులు వాస్తవాలను తెలుసుకుంటున్నారని, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను వారు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.
ప్రభుత్వానికి సహకరించాలి
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డలకు ఆర్థికంగా అండగా ఉంటున్న ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు.
నిజామాబాద్ బస్టాండును విస్తరిస్తాం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ చాలా ఇరుకుగా మారిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఈ నేపథ్యంలో బస్టాండ్‌ను విశాలమైన ప్రదేశంలో అన్ని హంగులతో తగిన సౌకర్యాలతో నిర్మించాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేసి సంస్థకు సహకరించాలని సూచించారు. ఆదాయం సమకూర్చడంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేందుకు తోడ్పాటునందించాలని కోరారు.