మెట్పల్లి, నవంబర్ 22: పార్టీ అండతో బీజేపీ నాయకుడు తమను మోసగించాడని ఆ పార్టీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎదుట ఓ మహిళ వాపోయింది. గ్యాస్ ఏజెన్సీలో తమకు రావాల్సిన వాటా ఇవ్వకుండా జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన బీజేపీ నేత సాంబారి ప్రభాకర్ వంచించాడని నిలదీసింది. సోమవారం మెట్పల్లిలోని నరేందర్రెడ్డి ఫంక్షన్హాల్లో అర్వింద్ ప్రెస్మీట్ పెట్టగా.. ‘మీ పక్కనే కూర్చున్న సాంబారి ప్రభాకర్ మా కుటుంబానికి తీరని అన్యా యం చేశాడు’ అని బాధిత మహిళ కోగిల లత ఆందోళనకు దిగారు. తన భర్త పేరిట ఉన్న గ్యాస్ గోదామును బలవంతంగా ప్రభాకర్ తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని పేర్కొన్నారు. భర్త చనిపోయి ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్న తమకు న్యాయం చేయాలని ఎంపీకి గోడు వెళ్లబోసుకున్నారు. లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని కన్నీరు పెట్టుకున్నారు.