రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
జమ్మికుంట చౌరస్తా/జమ్మికుంట, హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సభ నిర్వహించకుండా అడ్డుకున్నదే బీజేపీ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. ఈసీని అడ్డుపెట్టుకొని కేసీఆర్‌ను పర్యటించకుండా చేశారని విమర్శించారు. హుజూరాబాద్‌లో ఈటలకు ఓటమి తప్పదని, సీఎం సభ ఏర్పాటుచేసి మాట్లాడితే బీజేపీకి డిపాజిట్లు కూడా రావన్న ఉద్దేశంతో ఈసీని ఆశ్రయించారని అన్నారు. బీజేపీ ఎన్నికుట్రలు చేసినా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. ‘నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నువ్వు నన్ను ప్రశ్నిస్తవా? మతం పేరు చెప్పి దినం గడుపుకొనే నువ్వు.. నన్ను విమర్శిస్తవా? దమ్ముంటే అభివృద్ధి విషయంలో చర్చిద్దాం రా’ అని బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉండి కూడా బీజేపీ ప్రభుత్వం నుంచి అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు తెచ్చానని తెలిపారు. ‘నువ్వు ఎంపీగా గెలిచి రెండేండ్లయినా మీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయైనా నియోజకవర్గ అభివృద్ధికి తెచ్చావా’? అని నిలదీశారు. సమావేశంలో టీజీబీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.