స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను సొంతం చేసుకోవడానికి బీజేపీ ఆరాటపడుతున్నది. ఆ దేశభక్తునికి మతం మకిలి అంటించే ప్రయత్నం చేస్తున్నది. ఇంతకాలం తనకేమీ పట్టనట్టు వ్యవహరించిన కాంగ్రెస్.. పటేల్ తమవాడేనని కొత్త రాగం ఎత్తుకుంది. పటేల్ స్ఫూర్తితో మతతత్వంపై పోరాటం చేస్తామని ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన పార్టీ వర్కింగ్ కమిటీ విస్తృతస్థాయి సమావేశంలో కాంగ్రెస్ ప్రకటించింది. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసి పోరాడిన వీరులను, వారి విజయాలను స్ఫూర్తిదాయక చరిత్ర నుంచి అపహరించి తమ ఖాతాల్లో వేసుకోవడానికి పథకం ప్రకారం ఈ రెండు ప్రధాన జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి.
అందరివాడైన గాంధీజీని తమవాడేనని చెప్పుకొంటూ చెలామణి అవుతున్న కాంగ్రెస్ దారిలో స్వాతంత్య్ర ఉద్యమంలో ఏ పాత్రలేని బీజేపీ అమరులైన స్వాతంత్య్ర ఉద్యమకారులను ఒక్కొక్కరిని తన వైపు లాక్కుంటున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు పోరాడిన వీరులంతా ఈనాటి కాంగ్రెస్, బీజేపీలకు ఏ మాత్రం సంబంధం లేని వాళ్లు. ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ యథాతథంగా లేదు. ఎన్ని ముక్కలైందో ఆ పార్టీ వారికే తెలియదు. ఇవాళ కనిపిస్తున్న కాంగ్రెస్ అందులో ఓ ముక్క. ఇక బీజేపీ 1951లో భారతీయ జన్ సంఘ్ (దీపం గుర్తు)గా ప్రారంభమై, 1977లో జనతా పార్టీలో విలీనమై, తిరిగి 1980లో భారతీయ జనతా పార్టీగా అవతరించింది. స్వాతంత్య్రం సిద్ధించే నాటికి, పటేల్ గతించిన 1950 నాటికి ఆ పార్టీ పుట్టనే లేదు. స్వాతంత్య్రానికి ముందు కాంగ్రెస్ ఒక పార్టీ కాదు. ఒక విశాల ఐక్య వేదిక. కాంగ్రెస్ అంటేనే సభ లేదా సమావేశమని అర్థం. అందులో అందరూ ఉన్నారు. అందుకే స్వాతంత్య్రం రాగానే కాంగ్రెస్‌ను రద్దు చేయమని గాంధీజీ అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం రావడంతోనే కాంగ్రెస్ చిరస్మరణీయ పాత్ర ముగిసింది. 1952 తొలి లోక్‌సభ సాధారణ ఎన్నికల నాటికి కాంగ్రెస్ అధికారం కోసం రంగంలోకి దిగిన ఫక్తు రాజకీయ పార్టీగా అవతరించింది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ తమ పూర్వీకులను మరచిపోయి చాలా కాలమైంది. మాజీ ప్రధాని వాజపేయి, ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్న లాల్ కృష్ణ అద్వాని అతిరథ మహారథులే అయినా, బీజేపీని తొలిసారిగా కేంద్రంలో అధికారంలోకి తెచ్చినవారే అయినా ప్రస్తుత కమలం నేతలు వారిని పట్టించుకోవడం మానేశారు. మోదీ-షా పూజల్లో పునీతులు అవుతున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతంత్య్రోద్యమ నేతలు, త్యాగధనులు ప్రజా నాయకులు ఎందరో ఉన్నా కేవలం ఇందిరమ్మ, రాజీవ్ నామస్మరణలోనే ఆ పార్టీకి చెందిన నేటి నేతలు తరిస్తున్నారు. చివరికి నెహ్రూను కూడా మర్చిపోయారు. బీజేపీ అంటే మోదీ- షా, కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ, రాజీవ్.. ఇదీ నేటి జాతీయ రాజకీయ ముఖచిత్రం. ఈ రెండు పార్టీలకు పటేల్ ఉన్నట్టుండి ఆరాధ్యుడు అయిపోయారు. హిందూత్వ లౌకిక రాజకీయాలతో దేశం సైద్ధాంతికంగా నిలువునా చీలిపోతున్న ఈ సందర్భంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పటేల్ భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తున్నాయి.
పటేల్‌ను ఎవరైనా అభిమానించవచ్చు. ఆరాధించవచ్చు. కానీ, ఒక మతానికి ప్రతినిధిగా, పరిరక్షకునిగా వక్రీకరించి చూపడం పటేల్‌ను అవమానించడమే. దురదృష్టం ఏమిటంటే.. బీజేపీ ప్రత్యక్షంగా, కాంగ్రెస్ పరోక్షంగా అదే పని చేస్తున్నాయి. వాస్తవానికి పటేల్ తన విధ్యుక్తధర్మాన్ని నిర్వర్తించారు. జునాగఢ్, హైదరాబాద్ పాలకులు ఒకవేళ హిందువులై ఉండి, విలీనానికి వ్యతిరేకించినా పటేల్ అదే పని చేసేవారు. గాంధీజీ హత్యానంతరం బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్నూ కేంద్ర హోం మంత్రిగా పటేల్ నిషేధించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 559 సంస్థానాలు నయానో, భయానో దేశంలో విలీనమయ్యాయి. కశ్మీర్ సమస్య జటిలం కాగా జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాకుండా మొరాయించాయి. అప్పుడు ఉప ప్రధానిగా, హోం మంత్రిగా ఉన్న పటేల్ వరుసగా ఒక్కొక్క సంస్థానాన్ని దండోపాయంతో దారికి తెచ్చుకుని 1948 నాటికి దేశంలో విలీనం చేశారు.
మరీ కొరకరాని కొయ్యగా మారిన నిజాంను లొంగదీసుకోవడానికి హైదరాబాద్ నాలుగు వైపుల నుంచి భారత సైన్యాలు దాడి చేశాయి. అది సైనిక చర్య. కానీ, పోలీస్ చర్యగా పేరు పడింది. నాటి ప్రధాని నెహ్రూకు గాని, రక్షణ మంత్రి బల్దేవ్సింగ్కు గాని ఈ విజయంలో వాటా దక్కలేదు. ప్రధాని అధ్యక్షతన క్యాబినెట్ ఆమోదం, సైన్యాలకు రక్షణ మంత్రి ఆదేశం లేకుండా సైనికచర్య సాధ్యమయ్యేదేనా?
జునాగఢ్ (గుజరాత్), హైదరాబాద్ సంస్థానాల్లో పాలకులు ముస్లింలు. మెజార్టీ ప్రజలు హిందువులు. ప్రజామోదం లేని నిరంకుశ రాజ్యాధికారాలను కూలదోసిన వీరునిగా కంటే ముస్లిం పాలనను అంతమొందించిన హిందూ త్వ నాయకునిగా పటేల్‌ను స్థిరపరచడంలో గుజరాత్లో బీజేపీ విజయం సాధించింది. గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ వద్ద ఏకంగా 182 మీటర్ల ఎత్తైన పటేల్ మహా విగ్రహాన్ని ప్రతిష్ఠించింది.
ఇంతకాలం పటేల్‌ను పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు కండ్లు తెరిచింది. మొన్నటి అహ్మదాబాద్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృతస్థాయి సమావేశంలో రాహుల్‌గాంధీ ప్రసంగిస్తూ పటేల్ తమవాడని చెప్పి, ఒప్పించడానికి చాలా కష్టపడ్డారు. నెహ్రూ-పటేల్ మధ్య బీజేపీ ప్రచారం చేస్తున్నట్టుగా విభేదాలు లేవని అన్యోన్యంగా ఉండేవారని చెప్పుకొచ్చారు. పటేల్‌కు తామే వారసులమని బీజేపీ చెప్పుకోవడాన్ని ఖండించారు. వాస్తవానికి పటేల్ 1947-50 మధ్యకాలంలో నెహ్రూ మంత్రివర్గంలో ఉప ప్రధాని, హోం మంత్రి. స్వాతంత్య్రోద్యమ కాలంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. కనుక ఆయన్ను కాంగ్రెస్ ఎప్పుడో సొంతం చేసుకోవాల్సింది. కానీ, మర్చిపోయారు. విశేషమేమిటంటే నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ ప్రధానులుగా ఏలిన కాలంలో భారతరత్న పురస్కారానికి పటేల్ నోచుకోలేదు. 1975 ఆయన శత జయంతి సంవత్సరం. అప్పటి ప్రధాని ఇందిరమ్మ ఆ సందర్భంలోనైనా ప్రకటించి ఉంటే బాగుండేది. పటేల్ గతించిన నాలుగు దశాబ్దాల తర్వాత 1991లో పటేల్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించి నాటి ప్రధాని పీవీ పుణ్యం కట్టుకున్నారు.
1975-77 ఎమర్జెన్సీ కాలంలో అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న దేవకాంత బారువ ‘ఇండియా ఈజ్ ఇందిర, ఇందిర ఈజ్ ఇండియా’ అని ఏ ముహూర్తంలో అన్నారో కానీ, తదాదిగా ఇందిరమ్మ, రాజీవ్.. నేడు సోనియమ్మ, రాహుల్. కాంగ్రెస్ అంటే ఇంతే. ఇదే అదనుగా బీజేపీ చాణక్యం ప్రదర్శించి పటేల్‌ను తన వైపు లాగేసుకుంది. కాంగ్రెస్ నేతలకు పటేల్ అవసరం చేతులు కాలాక తెలియవచ్చింది. తమపై బీజేపీ చల్లుతున్న బురద నుంచి తప్పించుకోవడానికి పటేల్ వెనుక దాక్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది.
అహ్మదాబాద్ ప్రకటన అంతరార్థం అదే. పటేల్‌ను ఎవరైనా అభిమానించవచ్చు. ఆరాధించవచ్చు. కానీ, ఒక మతానికి ప్రతినిధిగా, పరిరక్షకునిగా వక్రీకరించి చూపడం పటేల్‌ను అవమానించడమే. దురదృష్టం ఏమిటంటే.. బీజేపీ ప్రత్యక్షంగా, కాంగ్రెస్ పరోక్షంగా అదే పని చేస్తున్నాయి. వాస్తవానికి పటేల్ తన విధ్యుక్తధర్మాన్ని నిర్వర్తించారు. జునాగఢ్, హైదరాబాద్ పాలకులు ఒకవేళ హిందువులై ఉండి, విలీనానికి వ్యతిరేకించినా పటేల్ అదే పని చేసేవారు. గాంధీజీ హత్యానంతరం బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్నూ కేంద్ర హోం మంత్రిగా పటేల్ నిషేధించారు. అదే నిజాంను గవర్నర్ స్థాయిలో హైదరాబాద్ రాష్ర్టానికి రాజ్ ప్రముఖ్‌గా నియమించారు.
వివిధ సందర్భాలలో అప్పటి ప్రధాని నెహ్రూతో పటేల్ విభేదించారు. చరిత్రను సరిగా అర్థం చేసుకోలేని రాజకీయ నాయకులు వికృత వ్యాఖ్యానాలు, విపరీత భాష్యాలు చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ సందర్భంలో ప్రసంగిస్తూ చిత్రంగా కాంగ్రెస్ పూర్వీకుల జాబితాలో భగత్ సింగ్‌ను కూడా చేర్చారు. ఇలా సమర వీరులకు, అమరవీరులకు, దేశభక్తులకు పార్టీలు, మతాలు, కులాల రంగులు పూసుకుంటూపోతుంటే భవిష్యత్తు తరాలకు ఎవరూ స్వచ్ఛంగా, సత్యంగా మిగలరేమో?
– డాక్టర్ అయాచితం శ్రీధర్ 98498 93238