న్యూఢిల్లీ : దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఆస్తుల్లోకెల్లా భారతీయ జనతా పార్టీకే అత్యధిక ఆస్తులు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) స్పష్టం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలోని 7 జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను ఏడీఆర్ వెల్లడించింది.
ఆస్తుల విలువలో బీజేపీ అగ్రస్థానంలో నిలవగా, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భారతీయ జనతా పార్టీకి రూ. 4,847.78 కోట్ల ఆస్తులు, బీఎస్పీకి రూ. 698.33 కోట్లు, కాంగ్రెస్కు రూ. 588.16 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది.
ఇక ఏడు జాతీయ పార్టీల ఆస్తుల మొత్తం విలువ రూ. 6,988.57 కోట్లు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తుల మొత్తం విలువ రూ. 2,129.38 కోట్లు అని తెలిపింది. ఇక జాతీయ పార్టీల ఆస్తుల విలువలో బీజేపీ ఆస్తులు 69.37 శాతంగా ఉన్నాయి.
ప్రాంతీయ పార్టీలను పరిశీలిస్తే.. సమాజ్వాదీ పార్టీ రూ. 563.47 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ పార్టీ రూ. 301.47 కోట్లతో రెండో స్థానంలో, అన్నాడీఎంకే రూ. 267.61 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.
మొత్తం ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల అప్పులు రూ. 134.93 కోట్లు అని ఏడీఆర్ వెల్లడించింది. అప్పుల్లో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి రూ. 49.55 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్కు రూ. 11.32 కోట్లు అని ఏడీఆర్ తెలిపింది. ప్రాంతీయ పార్టీల అప్పులు మొత్తం రూ. 60.66 కోట్లు అని వెల్లడించింది. తెలుగు దేశం పార్టీ మొత్తం అప్పులు రూ. 30.342 కోట్లు కాగా, డీఎంకే అప్పులు రూ. 8.05 కోట్లు అని ఏడీఆర్ రిపోర్టులో వెల్లడైంది.