
కుటుంబకలహాలతో మహిళ ఆత్మహత్య
డబుల్ బెడ్రూం రాకపోవడం వల్లేనంటూ..
కమలనాథుల తప్పుడు ఆరోపణ
బడంగ్‌పేట, డిసెంబర్ 28: బీజేపీ నాయకులు ‘చావు’ రాజకీయం చేశారు. కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటే.. రాజకీయ రంగు పులిమారు. డబుల్ బెడ్రూం రాకపోవడం వల్లే చనిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. మీర్‌పేట సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. లెనిన్‌నగర్‌కు చెందిన జంగమ్మ(30), గండయ్య దంపతులు కూలీ పనిచేస్తూ.. ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు. గండయ్యకు ఆస్తి గొడవలు ఉన్నాయి. ఈ గొడవలతో జంగమ్మ బలవన్మరణానికి పాల్పడింది. కాగా, లెనిన్‌నగర్‌లో తెలంగాణ ప్రభుత్వం 255 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నది. మొదటి దశలో 80 ఇండ్లు పూర్తి చేయించి లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. జంగమ్మ పేరు మీద కూడా ఇల్లు మంజూరైంది. రెండు నెలలో మిగతా గృహాలను పూర్తి చేయించి లబ్ధిదారులకు అందజేస్తామని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి గుడిసె వాసులకు మంగళవారం చేసిన సర్వేలో వివరించారు. కాగా, డబుల్ బెడ్రూం ఇల్లు రాకపోవడం వల్లే జంగమ్మ ఆత్మహత్య చేసుకుందని బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణ చేస్తున్నారని సీఐ మహేందర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.