హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): అమెజాన్ గోదాంలో మంగళవారం బీఐఎస్ హైదరాబాద్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో బీఐఎస్ ధ్రువీకరణ లేని పలు రకాల గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేశారు. వాటిలో 150 స్మార్ట్‌వాచ్‌లు, 15 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 30 సీసీటీవీ కెమెరాలు, 16 మిక్సర్లు, 10 ప్రెజర్ కుకర్లు, 1,937 స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లు, 326 వైర్లెస్ ఇయర్ బడ్స్, 170 మొబైల్ చార్జర్లు, 90 ఆట బొమ్మలు, ఇతర గృహోపకరణాలు ఉన్నాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సిటీలోని ‘అమెజాన్’ గోదాంలో జరిగిన ఈ సోదాల్లో దాదాపు రూ.50 లక్షల విలువైన 2,783 నాసిరకం ఉత్పత్తులను గుర్తించామని, దీనిపై కేసు నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు.
అమెజాన్ఫ్రెష్ సేవల విస్తరణ
న్యూఢిల్లీ, మార్చి 26: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్..తన ఫ్రెష్ సర్వీసులను మరో 40 నగరాలకు విస్తరించింది. దీంతో దేశీయంగా 170 నగరాల్లో ఫ్రెష్ సేవలు అందించినట్లు అయిందని పేర్కొంది. బుకింగ్ చేసుకున్న రోజునే కిరాణా వస్తువులను అందించాలనే ఉద్దేశంతో అమెజాన్ గతంలో ఈ ఫ్రెష్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సేవలు 130 నగరాల్లో అందుబాటులో ఉండగా, తాజాగా మరో 40 నగరాలు కలుపుకొని 170కి విస్తరించినట్లు పేర్కొంది.