న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఏబీజీ షిప్‌యార్డ్.. ఇప్పుడు దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఈ కంపెనీ పేరు మార్మోగిపోతున్నది. నిన్నమొన్నటిదాకా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.14,000 కోట్ల కుంభకోణమే అతిపెద్దది. కానీ రూ.23,000 కోట్లతో ఇప్పుడు ఈ రికార్డును ఏబీజీ షిప్‌యార్డ్ బద్దలుకొట్టింది. ఎస్బీఐ నేతృత్వంలోని 28 బ్యాంకుల కూటమి నుంచి రకరకాల పేరుతో రుణాలు తీసుకుని రూ.22,842 కోట్లను ఈ సంస్థ ముంచినట్టు సీబీఐ చెప్తున్నది. 98 అనుబంధ సంస్థల ద్వారా ఈ నిధులను మళ్లించి, వ్యక్తిగత ఆస్తులను కొన్నారని ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ వివరిస్తున్నది. ఇందులో 38 విదేశీ సంస్థలు, 60 దేశీయ సంస్థలున్నాయి.
ఏండ్ల తరబడి మోసం జరుగుతున్నా.. అటు బ్యాంకులు, ఇటు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు చేసిందేమీ లేదు. ఎఫ్ఐఆర్లు, ఆడిట్ రిపోర్టులే ఇందుకు నిదర్శనం. పీఎన్బీ కుంభకోణంలోనూ మామా-అల్లుళ్ళ చిలక్కొట్టుడు తెలిసిందే. చివరకు మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలు విదేశాలకు పారిపోగా, వాళ్లని భారత్‌కు రప్పించేందుకు నానా తంటాలు పడాల్సి వస్తున్నది. ఇందుకు కారణం సరైన మానిటరింగ్ వ్యవస్థ లేకపోవడమేనని, కొందరు అవినీతి బ్యాంక్ ఉన్నతోద్యోగులూ కారణమేనన్న విమర్శలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. 2008 ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఏబీజీ షిప్యార్డునూ దెబ్బతీశాయి. ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా కోట్లాది రూపాయల రుణాలను బ్యాంకులు ఇస్తూపోవడం కూడా ఈ విమర్శలకు అద్దం పడుతున్నది. ఇక ఫిర్యాదు అందిన తర్వాత అన్నీ పరిశీలించి సీబీఐ కేసు నమోదు చేయడానికే దాదాపు ఏడాదిన్నర పట్టిందంటే వ్యవస్థలో ఉన్న లోపాలను అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సంస్థ మాజీ సీఎండీ రిషీ అగర్వాల్‌ను సీబీఐ ప్రశ్నిస్తున్నది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఈ నెల 12న 13చోట్ల సోదాలను చేయగా, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి విదితమే.
కార్పొరేట్ల మాయాజాలానికి బ్యాంకులు.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులే బలైపోతున్నాయి. వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడం, ఆ తర్వాత చేతులెత్తేయడం సాధారణమైపోయిందంటే అతిశయోక్తి కాదు. వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చేయూతనివ్వడం ప్రధానమే.. కానీ మోసగాళ్ల నుంచి కీలకమైన బ్యాంకింగ్ రంగాన్ని కాపాడుకోవడం కూడా అంతకంటే ముఖ్యమని జరుగుతున్న పరిణామాలను ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కార్పొరేట్ రుణాల మంజూరులో కేంద్ర ప్రభుత్వ పెద్దల జోక్యం కూడా ఈ దుస్థితికి కారణమేనన్న అభిప్రాయాలు వినిపిస్తుండటం గమనార్హం. కాగా, బ్యాంకుల మొండి బకాయిల్లో.. భారీ మోసాల్లో గుజరాత్‌కు చెందిన సంస్థల పాత్రే ఎక్కువగా ఉండటం కొసమెరుపు. దీనిపై ఆ రాష్ర్టానికి గతంలో ముఖ్యమంత్రిగా ఉండి, ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఏం చెప్తారన్న విమర్శలూ రాజకీయంగా గట్టిగా వస్తున్నాయి.
బ్యాంకులను రూ.23 వేల కోట్లు ముంచిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్‌గేషన్(సీబీఐ) దూకుడును పెంచింది. ఏబీజీ షిప్‌యార్డ్ మాజీ సీఎండీ రిషీ అగర్వాల్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద మోసానికి పాల్పడిన ఏబీజీ షిప్‌యార్డ్‌పై ఇప్పటికే ఈడీ, సీబీఐలు కేసులు దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత వారం నుంచి రిషీ అగర్వాల్‌ను ప్రశ్నిస్తున్న సీబీఐ.. ఈ వారంలోనూ ఆయనను ప్రశ్నించనున్నట్టు తెలిపింది. అలాగే అగర్వాల్ స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
ఐసీఐసీఐ 7,089
ఐడీబీఐ 3,639
ఎస్బీఐ 2,925
బీవోబీ 1,614
ఎగ్జిమ్ 1,327
పీఎన్బీ 1,244
ఐవోబీ 1,244
బీవోఐ 719
ఇతరులు 3,041
మొత్తం 22,842
ఏర్పాటు : 1985
ప్రధాన కేంద్రం : సూరత్ (గుజరాత్)
ప్రమోటర్ : రిషీ కమలేశ్ అగర్వాల్
సేవలు : నౌకల డిజైన్
నిర్మాణం, మరమ్మత్తు
తయారీ కేంద్రాలు : దహేజ్, సూరత్
రిపేర్ యూనిట్ : గోవా
2005-2010: సంస్థ ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా ఉదారంగా రుణాలు ఇస్తూపోయిన బ్యాంకులు
మార్చి 2014: కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ కింద ఏబీజీ షిప్‌యార్డ్‌కు రీ-స్ట్రక్చర్ లోన్ల కోసం ఎస్బీఐ ప్రయత్నాలు. సకాలంలో వడ్డీ, వాయిదా చెల్లింపులు లేవని విఫలం
జూలై 2016: ఏబీజీ ఖాతాను మొండి బకాయి (నిరర్థక ఆస్తి లేదా ఎన్పీఏ)గా ప్రకటించిన బ్యాంకులు
జనవరి 2019: మోసాన్ని గుర్తించిన ఎస్బీఐ. ఏబీజీ షిప్‌యార్డ్‌పై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిన ఈఅండ్‌వై ఎల్ఎల్పీ. ఏప్రిల్ 2012-జూలై 2017 మధ్య మోసం జరిగినట్టు ఆధారాలు
8 నవంబర్ 2019: ఫిర్యాదు చేసిన ఎస్బీఐ
12 మార్చి 2020: వివరాలను కోరిన సీబీఐ
ఆగస్టు 2020: మరింత సమాచారంతో సీబీఐకి ఎస్బీఐ ఫిర్యాదు
7 ఫిబ్రవరి 2022: ఏబీజీ షిప్‌యార్డ్, ఏబీజీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ
15 ఫిబ్రవరి 2022: ఏబీజీ ప్రమోటర్ రిషీ అగర్వాల్, సంస్థ ఉన్నతోద్యోగులు శంతనం ముత్తుస్వామి, అశ్విని కుమార్లపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన సీబీఐ
16 ఫిబ్రవరి 2022: మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్