పట్నా, నవంబర్ 11: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. మంగళవారం 122 శాసనసభ స్థానాలకు జరిగిన రెండో, చివరి విడత ఎన్నికలకు ఓటర్లు పోటెత్తారు. రికార్డు స్థాయిలో 69 శాతం ఓటింగ్ నమోదైంది. మొదటి దశలో 65.9 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. రెండు విడతల్లో కలిపి ఓవరాల్గా 66.91 శాతం ఓటింగ్ నమోదైందని, గత శాసనసభ ఎన్నికల కంటే ఇది 9.6 శాతం ఎక్కువని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వినోద్ సింగ్ ప్రకటించారు. అలాగే రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఈసారే అత్యధిక శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపారు. పురుషుల కంటే ఈ సారి మహిళా ఓటర్లు అత్యధికంగా పోలింగ్ పాల్గొనడం మరో విశేషం. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 14న వెలువడనున్నాయి.
8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
మంగళవారం ఆరు రాష్ర్టాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించగా, మిజోరం ‘దాంపా’లో అత్యధికంగా 82శాతం, తెలంగాణలోని జూబ్లీహిల్స్లో అత్యల్పంగా 48శాతం ఓటింగ్ నమోదైంది.