Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్లో 95వ రోజు హౌజ్‌లో భావోద్వేగాలు, షాకింగ్ ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచే హౌస్‌లో ఎమోషనల్ వాతావరణం నెలకొంది. లీడర్‌బోర్డులో అతి తక్కువ పాయింట్లతో బాటమ్‌లో ఉన్న సుమన్ శెట్టి టాస్క్‌ల్లో ఇకముందు పాల్గోలేరని బిగ్ బాస్ ప్రకటించారు. దీనితో ఆయన తన స్కోర్‌లో సగాన్ని మరొకరికి అప్పగించాలని ఆదేశించారు. బిగ్ బాస్ నిర్ణయంతో భావోద్వేగానికి లోనైన సుమన్ శెట్టి ముందుగా తన స్కోర్లు భరణికి ఇవ్వాలని నిర్ణయించారు.“ఈ హౌస్‌లో నాకు అండగా నిలిచింది మీరు మాత్రమే” అని చెప్పిన సుమన్.. భరణిని కౌగలించుకొని ఎమోషనల్ అయ్యారు. దీనితో భరణి కూడా కంటతడి పెట్టుకున్నారు.
అయితే భరణి తనకి స్కోర్ వద్దని, “నాకు కాదు… ఎవరికి అవసరమో వారికి ఇవ్వండి” అని చెప్పడంతో సుమన్ చివరకు పాయింట్లను సంజనకు అప్పగించారు. దీంతో సుమన్ శెట్టికి టాస్క్‌ల నుండి తప్పుకునే పరిస్థితి ఏర్పడింది. తదుపరి యుద్ధంలో ఎవరు ఆడకూడదని నిర్ణయించే సమయం రాగానే ఇంటి సభ్యులు భరణిని టార్గెట్ చేశారు. దీని వల్ల భరణి ఆ గేమ్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయాడు. జోకర్ బొమ్మపై బాల్లను విసిరే గేమ్‌లో ఇమ్మాన్యుయేల్, సంజన విజయం సాధించారు. ఈ రౌండ్ తర్వాత పవన్ బాటమ్‌లోకి చేరి తదుపరి యుద్ధంలో ఆడే ఛాన్స్‌ను కోల్పోయాడు. పవన్ తన పాయింట్లన్నీ తనూజకు ఇచ్చేశాడు.
మరొకరిని తప్పించాలని బిగ్ బాస్ అడిగినప్పుడు మళ్లీ భరణికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అందులో కళ్యాణ్ కూడా భరణి పేరునే చెబుతూ వెన్నుపోటు పొడిచాడు. తాను ఎన్నిసార్లు కళ్యాణ్‌ను సపోర్ట్ చేసినా, తిరిగి తనకు సహాయం చేయకపోవడంతో భరణి మనస్తాపానికి గురయ్యాడు.“నువ్వు నాకు ఒక్కసారైన సపోర్ట్ చేసి ఉండుంటే న్యాయం జరిగేదే” అని కళ్యాణ్‌ను ప్రశ్నించాడు. దీనికి కళ్యాణ్ సమాధానం ఇస్తూ.. “మీరు ప్రతి సారి రాంగ్ ప్లేస్‌లో ఉంటున్నారు. మిమ్మల్ని బలి చేయాలనే ఉద్దేశం లేదు” అని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ భరణి యుద్ధం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
తదుపరి టాస్క్‌లలో ఇమ్మాన్యుయేల్ విజయం సాధించారు. అనంతరం తనూజకు అభిమానుల ఎదుట ఓట్ అప్పీల్ చేసే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఒక అభిమాని ఆమెను సంచలన ప్రశ్న అడిగాడు. మీరు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు… అది ఫేక్ అనిపిస్తుంది. పిట్టీ గెయిన్ కోసం ఏడుస్తారా? అని అడగగా, దానికి తనూజ సమాధానం: ఇస్తూ.. నా ఏడుపు ఫేక్ కాదు. ఈ హౌస్‌లో నా ఎమోషన్స్ పంచుకునే వారు లేకపోవడంతో అలా అనిపిస్తుంది అని వివరించింది. మొత్తం మీద 95వ రోజు డ్రామా, వ్యూహాలు, ఎమోషన్స్‌తో ఆసక్తికరంగా సాగింది. ఇంట్లో ఉన్న ప్రతీ సభ్యుడు ఎలిమినేషన్ దగ్గరగా ఉండటంతో గేమ్ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది.