‘రోషన్‌ను మా ఇంటి అబ్బాయిలా భావిస్తాం. అతనికి సినిమా అంటే చాలా ప్రేమ. ఈ సినిమాలో రోషన్‌ని చూస్తుంటే ‘చిరుత’ సినిమాలో రామ్‌చరణ్ గుర్తుకొచ్చారు.’ అని అన్నారు హీరో రానా. బుధవారం జరిగిన ‘ మోగ్లీ’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోషన్ కనకాల హీరోగా నటించిన ఈ చిత్రానికి ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్‌రాజ్ దర్శకుడు.
టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మాతలు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ‘కలర్ ఫొటో’ తరహాలోనే ఈ సినిమా కూడా ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. ప్రేక్షకుడి సమయానికి విలువిచ్చి తీసిన సినిమా ఇదని, కచ్చితంగా అందరికి నచ్చుతుందని దర్శకుడు సందీప్‌రాజ్ పేర్కొన్నారు.
ఇదొక ఇంటెన్స్ యాక్షన్ మూవీ అని, ఆర్టిస్టులందరూ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ప్రతి మనిషి జీవితంలో ఓ యుద్ధం ఉంటుందని, గట్టిగా నిలబడి పోరాడితేనే విజయమని, ఈ సినిమాను అందరూ గెలిపించాలని హీరో రోషన్ కనకాల కోరారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి, గీత రచయిత చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.