హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఓ టీచర్‌కు పంచాయతీ ఎన్నికల డ్యూటీ కేటాయించారు., ట్రైనింగ్‌కు రమ్మన్నారు. సంతకాలు కూడా పెట్టించుకున్నారు. అంతా అయ్యాక డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు వెళ్తే రిజర్వ్‌లో పెట్టమన్నారని చెప్పి ఆఖరుకు డ్యూటీ వేయకుండానే వెళ్లిపోమ్మన్నారు. నిబంధనల ప్రకారం అలాంటి వారికి ఎన్నికల విధుల పారితోషికం చెల్లించాల్సి ఉన్నా పైస్థాయి అధికారులు జేబుల్లో వేసుకుని వారిని ఉత్తచేతులతోనే పంపించారు. ఇలా ఒక్కరిద్దరు కాదు.. వందల మందికి జరిగినట్లు టీచర్లు ఆరోపిస్తున్నారు. మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి గోల్మాల్ చాలాచోట్ల జరిగాయని వాపోతున్నారు.
పది నుంచి 20శాతం
పంచాయతీ ఎన్నికల కోసం టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు డ్యూటీలు వేశారు. అత్యవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్నిచోట్ల 10 నుంచి 15 శాతం, మరికొన్ని చోట్ల 20 శాతం సిబ్బందిని రిజర్వ్ కోటాలో తీసుకుని వాళ్లందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. లెక్క ప్రకారం విధుల్లో ఉన్న వారితో పాటు, రిజర్వు వారికీ అన్ని సౌకర్యాలు కల్పించాలి. డ్యూటీ లేకపోయినా పారితోషికం ఇవ్వాల్సిందే. కానీ, చాలాచోట్ల అధికారులు రిజర్వు సిబ్బందిని ‘ఉంటే ఉండండి.. పోతే పోండి’ అంటూ చెప్పడమే కాక వారికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్, భోజన ఖర్చులు కూడా ఇవ్వలేదు. కాగా, ఎన్నికల వ్యయంపై ఎలాంటి ఆడిటింగ్ ఉండదు., లెక్కాపత్రం అస్సలే ఉండదు. దీంతో న్యాయంగా తమకు రావాల్సిన డబ్బులను కొందరు అధికారులు నొక్కేశారని టీచర్లు ఆరోపిస్తున్నారు.
చెప్పినంత ఇవ్వలే
రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి చాలాచోట్ల చెప్పినంత పారితోషికం ఇవ్వలేదు. కొన్నిచోట్ల వాహనాలను కూడా ఏర్పాటు చేయకపోవడంతో సిబ్బంది సొంతవాహనాలనే వినియోగించారు. రిటర్నింగ్ ఆఫీసర్‌కు నాలుగు రోజులకు రూ.2వేలు ఇచ్చి, భోజన ఖర్చుల కింద రూ. 500 ఇవ్వాల్సి ఉండగా, భోజనం పెట్టి డబ్బుల్లో కోతపెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో మైక్రో అబ్జర్వర్లు లేకున్నా నియమించినట్టుగా లెక్కలు చూపించారు. అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు ఇవ్వాల్సిన రూ.1300 బదులుగా రూ. 800 ఇవ్వడంతో ప్రశ్నించిన సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలంటూ పలువురు ఎంపీడీవోలు, జెడ్పీ సీఈవోలు చేతులు దులుపుకొన్నారు. ఎన్నికల విధులకు హాజరైన వారికి రిటర్నింగ్ ఆఫీసర్ అటెండెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉన్నా, ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో లెక్కలు తేల్చే అవకాశం లేకపోవడమే అలాంటి అధికారులకు మరింత కలిసొచ్చింది.
ఆన్లైన్లో జమచేయాలన్న డిమాండ్లు
రాష్ట్రంలోఎన్నికలు.. సర్వేలు .. ఇలా ఏది చేయాలన్నా ప్రభుత్వం టీచర్లనే ఉపయోగించుకుంటున్నది. కులగణనకూ వాడినా ఇంత వరకు పారితోషికం పూర్తిగా ఇవ్వలేదు. రేపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఓటరు జాబితా సవరణ) చేయాలన్న మళ్లీ టీచర్లే గతి. ఏ పని చేయాల్సిన టీచర్లు తప్ప మరోమార్గం లేదు. అప్పగించిన పనికోసం వారు సెలవుల్లోనూ చేయాల్సిందే. అటు సర్కార్ అప్పగించిన అదనపు పనులకు తోడు ఇటు యథావిధిగా పాఠాలు చెప్పడం, సిలబస్ కంప్లీట్ చేయడం వారి మెడకే. ఇంతగా కష్టపడుతున్న తమ శ్రమను కొందరు అధికారులు దోచుకోవడంపై టీచర్లు కుమిలిపోతుండగా, మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇలాంటి వాటిని కట్టడి చేయాలని, ఎన్నికల పారితోషికాన్ని ఆన్లైన్లో జమచేయాలని వారు కోరుతున్నారు.