Donald Trump : గ్రీన్లాండ్ (Greenland) కు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి హెచ్చరికలు చేశారు. తాము అగ్రరాజ్యంలో చేరబోమని, డెన్మార్క్ (Denmark) లోనే ఉంటామని గ్రీన్లాండ్ ప్రధాని (Greenland PM) జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ (Jens Frederik Nielsen) ప్రకటించడంపై ట్రంప్ స్పందించారు. డెన్మార్క్‌లోనే ఉంటామనడం నీల్సన్ సమస్య అన్నారు. నీల్సన్ అభిప్రాయంతో తాను ఏకీభవించట్లేదని చెప్పారు. అతడి గురించి తనకు సరిగా తెలియదన్నారు.
కానీ వాళ్లు డెన్మార్క్‌లోనే కొనసాగాలనుకుంటే అది గ్రీన్‌లాండ్‌కే పెను సమస్యగా మారుతుందని ట్రంప్ హెచ్చరించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రీన్లాండ్, డెన్మార్క్‌కు ఏవైనా ఆఫర్లు ప్రకటించారా..? అని ఈ సందర్భంగా మీడియా ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని బదులిచ్చారు. గ్రీన్లాండ్ తప్పనిసరిగా అమెరికా భూభాగంలో చేరాలని అన్నారు.
గ్రీన్లాండ్ అమెరికా భూభాగంలో చేరకపోతే ఆ ప్రాంతాన్ని రష్యా, చైనా ఆక్రమిస్తాయని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే ఆయా దేశాల రక్షణ బలగాలు అక్కడ పాగా వేశాయన్నారు. తాను తలుచుకుంటే అక్కడ అధిక సంఖ్యలో తమ సైన్యాన్ని మోహరించగలనని చెప్పారు. గ్రీన్లాండ్లో అమెరికా జెండా ఎగరాలని వ్యాఖ్యానించారు.