పెద్దమందడి : రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు ఆధార్ కార్డు మాదిరిగానే ప్రతి భూకమతానికి భూధార్ (Bhudhar) కార్డును ప్రభుత్వం ఇవ్వనుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి ( MLA Megha Reddy ) అన్నారు. గురువారం పెద్దమందడి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి, భూమి హక్కుల రికార్డు – 2025 చట్టం గురించి, అందులోని ముఖ్యాంశాల గురించి రైతులకు అవగాహన నిర్వహించారు.
రాష్ట్రంలోని రైతులు, మేధావులు, నాయకుల సలహాలు, సూచనలతోనే ప్రభుత్వం భూ భారతి చట్టం – 2025 ను రూపొందించి అమలులోకి తెచ్చిందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంతో అన్ని వివాదాలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చారని చెప్పారు. భూ భారతి చట్టాన్ని అమలు చేయడంలో రెవెన్యూ అధికారులది కీలక పాత్రని వివరించారు.
పేద ప్రజల కడుపు నింపడానికి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందిస్తుందని చెప్పారు. రాజీవ్ యువ వికాసంతో యువతకు స్వయం ఉపాధి బాటలు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంపై రెవెన్యూ రైతులతో పాటు అందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వం ఈ నూతన చట్టం ద్వారా అనేక భూ సమస్యలకు పరిష్కార మార్గం చూపించనుందని తెలిపారు.
సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే
పెద్దమందడి మండల కేంద్రంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మామిళ్ల పల్లి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి స్వప్న అనే దళితకుటుంబానికి చెందిన సన్న బియ్యం లబ్ధిదారుల ఇంటిని సందర్శించి, ఆమె ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ సరస్వతి, ఇతర అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.