జోగులాంబ గద్వాల : భూభారతి (Bhu Bharati ) 2025 చట్టం రైతులకు భద్రత కల్పిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. భూభారతి చట్టం గురించి ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు ధరూర్ మండల కేంద్రంలో తహసీల్ కార్యాలయం వద్ద శనివారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూభారతి చట్టంపై అవగాహన కల్పించి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సాదా బైనామాలతో పాటు ఇతర ఏ సమస్య ఉన్న పరిష్కరిస్తామని తెలిపారు. పేర్లు, సర్వే నంబర్లు, ఎకరాలు తప్పు పడినా గతంలో కార్యాలయాలు చుట్టూ తిరిగిన పనులు కాలేదని, ప్రస్తుతం చట్టం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. ఒక్క రూపాయి చెల్లించకుండా రైతులు నేరుగా తహసీల్, ఆర్డీవో, కలెక్టర్ల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు.
మే 1 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామాలకు అధికారులు వచ్చి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు. ఈ చట్టంతో పాటు అవసరమైన సవరణలు చేయడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. ఆధార్ కార్డు మాదిరి భూదార్ కార్డులను ఇస్తామని మంత్రి తెలిపారు. 26 వేల సాదా బైనామీల దరఖాస్తులు పరిష్కరిస్తామని అన్నారు.
చట్టం ద్వారా ప్రభుత్వ, అటవీ, ప్రైవేట్ భూములకు గుర్తింపు తెచ్చి భద్రపరుస్తామని తెలిపారు. అధికారులు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరించారు. ఎంపీ మల్లు రవి ( MP Mallu Ravi ) మాట్లాడుతూ, రైతుల సమస్యలు తొలగించుటకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుని భూమి భద్రత కల్పించుకోవాలని అన్నారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల హన్మంతు, జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ భూపాల్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.