డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ పేరును రోజూ గుర్తు చేసుకోవాల్సిందే. భారత రాజ్యాంగం మన ముందు ఉన్నన్నాళ్లూ ఆయన ఉన్నట్టే. ఎంతమంది ఎన్ని రకాలుగా సవరణల పేరుతో మరణ శాసనాలు రాస్తున్నా రాజ్యాంగం బతికే ఉంటుంది. 1973లో కేశవానందభారతి కీలకమైన తీర్పు రాజ్యాంగానికి పునర్జన్మ ఇచ్చినా, దానికి పునాదిగా అంబేద్కర్ నిలబడే ఉంటారు. నేడు రాజ్యాంగ పీఠికలోని ఒక్కో పదం, ఒక్కో వాక్యం గురించి అంతా చర్చించుకుంటున్నారంటే అందుకు అంబేద్కర్ ఒక్కరే కారణం. సవరణల పేరుతో తూట్లు పొడిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా అవేవీ ముందుకు సాగకుండా ఆపేసే పునాది అంబేద్కర్ నిర్మించారు. అందుకే ఆయన చిరంజీవి.
‘కులం’తో కుతకుతగా రగులుతున్నది మనదేశం. పగిలిపోతుందేమో అనేంత ద్వేషం, ఈర్ష్య, అవినీతి. అణువణువూ అమ్ముకోవాలని పాలకులు ప్రయత్నిస్తున్నారు. కుల ద్వేషాలతో తిట్టుకుంటూ కొట్టుకుంటూ సాగుతున్నారు. మన రాజ్యాంగం మొదటి అధికరణ (ఆర్టికల్) India, that is Bharath shall be a Union of India అని అంటూనే వెంటనే రెండు, మూడవ భాగంలో Sub Articleలో రాష్ర్టాలతో కలిసి మన దేశం యూనియన్ అయిందని చాలా స్పష్టంగా చెప్పినవాడు అంబేద్కర్. యూనియన్ అంటే ఏమవుతుంది, రాష్ర్టాలన్నీ కలిస్తేనే మన దేశం అని చెప్పటానికి గంటలు, రోజులు రాజ్యాంగ నిర్ణాయక పరిషత్తులో చర్చించారు.
ఆ సమయంలో న్యాయవాదిగా మారి, క్షణక్షణం ఒక్కో అక్షరాన్ని రాజ్యాంగానికి చేర్చినవాడు, కూర్చినవాడు అంబేద్కర్. ఇవ్వాళ ‘ఒక జాతి..ఒకే ఎన్నిక’ అనే నినాదం వెనుక ఏ రహస్యం ఉన్నదో, ఏ అవసరం ఉంటున్నదో? ఆలోచించాల్సి ఉన్నది. ఒక జాతి-ఒకే ఎన్నిక వంటి మాటలు అంబేద్కర్ ఎన్నడూ చెప్పలేదు. ‘దేశం’ ఎదుర్కొంటున్న ‘ముప్పు’ అనే ఆలోచనను లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత గొప్పదైనా భారత రాజ్యాంగం ‘తనంతట తాను’గా మౌలిక స్వరూపాన్ని రక్షించుకోవడం చాలా కష్టం. Basic Structure కోసం నిరంతరం ప్రయత్నం చేయాలి.
భారత రాజ్యాంగం దేశాన్ని ‘యూనియన్’ (రాష్ర్టాల కలయిక) అని పేర్కొన్నప్పటికీ, దాని నిర్మాణం ప్రాథమికంగా సమాఖ్య లక్షణాలతోనే ఉంటుందని అంబేద్కర్ స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిషత్తులో ఆయన మాట్లాడుతూ.. ‘రాజ్యాంగం అనేది సమాఖ్య రాజ్యాంగం… రాష్ర్టాలు కేంద్రానికి కేవలం ఏజెంట్లు కాదు‘ అని తేల్చిచెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ‘ఒకే జాతి-ఒకే ఎన్నిక’ (ONOE) (అందులో ‘దేశం’ అనే మంచి మాట ఉందంటారా?) అనే ప్రతిపాదన మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. ఇది ఈ కాలంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రాజ్యాంగ సంస్కరణ అని ప్రచారం జరుగుతున్నది. ఈనెల 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సభలో మాట్లాడుతూ..ఉమ్మడి పౌరస్మృతితో పాటు ONOE కూడా ఇంకా పూర్తి కాలేదని, కానీ ఇది కీలకమైన భాగంగా ఉండి తీరుతుందని పునరుద్ఘాటించారు. పరిపాలనా సామర్థ్యం, స్థిరత్వం, వ్యయ నియంత్రణ కోసం ఈ సంస్కరణ అని కేంద్రం ప్రకటిస్తుంటే, ఇది సమాఖ్య వ్యవస్థకు, ప్రజాస్వామ్య జవాబుదారీతనానికి ముప్పు తెస్తుందని రాజ్యాంగ పరిశోధకులు, రచయితలు, అధ్యాపకులు, న్యాయవాద నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఒక కోణంలో చూస్తే ONOE పరిపాలనాపరంగా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఏదో ఒకచోట నిరంతరం ఎన్నికలు (లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలు) జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల తరచుగా ‘ఎన్నికల నియమావళి’ అమల్లోకి రావడం, యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడం, రాజకీయ నాయకులు ఎప్పుడూ ప్రచార మూడ్, మోడ్‌లోనే ఉంటున్నారు. ప్రభుత్వాలను ప్రజాస్వామ్య వ్యతిరేకంగా కూల్చడం, కొత్తవారిని గెలిపించుకోవడం కొనసాగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహిస్తే పారదర్శక పాలన సాగుతుందని, ఖర్చు తగ్గుతుందని, దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవచ్చని కేంద్రం వాదిస్తున్నది.
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఇప్పటికే ఒక నివేదికను సమర్పించింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2024 ద్వారా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను అనుసంధానం చేసి, ఆ తర్వాత 100 రోజుల్లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించింది. దీనికోసం అవసరమైతే రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలాన్ని తగ్గించడం లేదా పెంచడం వంటి నిబంధనలు కూడా ఉన్నాయి.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ 2026 ఫిబ్రవరి 12న పార్లమెంటరీ కమిటీ ముందు ప్రకటిస్తూ ONOE వల్ల రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి ఏ ముప్పూ లేదని పేర్కొన్నారు. ఆయన వాదన ప్రకారం..ఇది కేవలం ఎన్నికల సమయాన్ని మారుస్తుంది తప్ప, ఎన్నికల సారాంశాన్ని కాదు. ఓటరు హక్కులు, ప్రజాస్వామ్య పద్ధతులు, ‘అవిశ్వాస తీర్మానం’ వంటి జవాబుదారీ యంత్రాంగాలు యథాతథంగా ఉంటాయి. 1967 వరకు దేశంలో ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి, కనుక ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు.
లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పి.డి.టి. ఆచారి కేంద్ర ప్రభుత్వ వాదనతో విభేదించారు. ఆయన అభిప్రాయం ప్రకారం..ఆర్టికల్ 172 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలకు ఐదేండ్ల స్వతంత్ర పదవీకాలం ఉంటుంది. లోక్‌సభతో సంబంధం లేకుండా ఇవి పనిచేస్తాయి. ONOE అమలు చేయాలంటే రాష్ర్టాల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తూ వాటి పదవీకాలాన్ని కేంద్రం నియంత్రించాల్సి ఉంటుంది. సమాఖ్య వ్యవస్థ అనేది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగం. రాష్ట్ర అసెంబ్లీల నిర్ణీత పదవీకాలాన్ని మార్చడం అంటే వాటి రాజ్యాంగ ఉనికిని తగ్గించటమే.
ఎన్నికల ఖర్చు పెరుగుతున్నదనే మాట చాలావరకు నిజమే, కానీ ఆ వాదనపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నికల సంఘం చేసే ఖర్చు జాతీయ బడ్జెట్లో చాలా స్వల్పం. అసలైన ఖర్చు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఎన్నికలు తగ్గితే ఆ డబ్బు ప్రజోపయోగ పనులకు మళ్లుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. అదేవిధంగా, ఎన్నికల వల్ల పాలన స్తంభిస్తుందన్న వాదన కూడా సరికాదు. ఎందుకంటే 1967 తర్వాత కూడా దేశం అనేక సంస్కరణల ద్వారా, ఎంతో ఆర్థిక వృద్ధిని సాధించింది.
తరచుగా జరిగే ఎన్నికలు నాయకులను ప్రజల వద్దకు వెళ్లేలా చేస్తాయి. ప్రజలు తమ అసంతృప్తిని లేదా మద్దతును తెలియజేసే అవకాశం ఉంటుం ది. అన్నీ ఒకేసారి జరిగితే, జాతీయ అంశాల వెల్లువలో స్థానిక రాష్ట్ర స్థాయి సమస్యలు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. ఇది ప్రాంతీయ రాజకీయాల ప్రాధాన్యతను తగ్గిస్తుంది. ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మధ్యలోనే పడిపోతే (dissolve d), అక్కడ మళ్లీ ఎన్నికలు జరుపాల్సి ఉంటుంది. ఎన్నికైన కొత్త ప్రభుత్వం కేవలం మిగిలిన కాలానికే పరిమితం అవుతుంది తప్ప పూర్తి ఐదేండ్ల్లు ఉండదు. ఇది ఓటరు తీర్పును అవమానించడమే అవుతుంది.
రాజకీయంగా చూస్తే, ఈ సవరణలకు పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీతో పాటు కనీసం సగం రాష్ర్టాల ఆమోదం అవసరం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో విపక్షాల మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు. అక్కడ కూడా రాజ్యసభలో మెజారిటీ సాధిస్తే, ఇక రాజ్యాంగాన్ని చాలా సులువుగా మార్చుకొని మౌలిక స్వరూపాన్ని కూడా మార్చేసే ప్రమాదం ఉన్నది. అంబేద్కర్ దృక్కోణం నుంచి చూస్తే, రాష్ర్టాలు కేంద్రానికి లోబడి ఉండే పరిపాలనా శాఖలు కావు, అవి స్వతంత్ర రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినవి. ONOE వల్ల రాష్ర్టాల స్వయంప్రతిపత్తి దెబ్బతింటే అది అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధం అవుతుంది.
‘జాతీయత’, ‘ఐక్యత’ పేరుతో ప్రజాస్వామిక ‘వైవిధ్యాన్ని’ విస్మరించకూడదు. పరిపాలనా సౌలభ్యం ముఖ్యం కావచ్చు. కానీ అది రాజ్యాంగ గుర్తింపు, ప్రజాతీర్పును బలిపెట్టి సాధించకూడదు. ONOE ప్రతిపాదనను కేవలం ఖర్చు, సమయం అనే కోణంలోనే కాకుండా, రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి అది ఎంతవరకు లోబడి ఉందనే కోణంలో లోతుగా పరీక్షించాల్సి ఉన్నది.
– మాడభూషి శ్రీధర్