సిటీబ్యూరో: షోరూంల్లో వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఆర్టీఏ కార్యాలయాలకు, షోరూంలకు మధ్య సమన్వయం లోపించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా వాహనాలు కొనుగోలు అనంతరం జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా వాహనదారుడి వివరాలు అన్ని షోరూంల్లోనే నమోదవుతాయి. ఆ వివరాలు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు పరిశీలించి సంబంధిత డాక్యుమెంట్స్ జారీ చేస్తారు. ఈ ప్రక్రియలో షోరూం వాళ్లు తీసుకుంటున్న వాహనదారుడి వివరాలు తప్పుగా నమోదు అవుతున్నాయి.
ఫిబ్రవరి, మార్చిలో షోరూం రిజిస్ట్రేషన్ల్లో ఒక వ్యక్తిపై రెండు వాహనాలు ఉన్నప్పటికీ షోరూంలకు సంబంధించిన పోర్టల్‌లో ఒకే వాహనం ఉన్నట్టు చూపిస్తుంది. దీంతో వాళ్లు ఆ డేటాను ఆర్టీఏ కార్యాలయానికి పంపగా, అక్కడ పరిశీలించిన అధికారులు రెండు వాహనాల ట్యాక్స్ వసూలు చేయాలని తిరిగి పంపించారు. దీంతో వాహనదారుడిని మళ్లీ పిలిపించి అన్ని వివరాలు సేకరించి మళ్లీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి వస్తున్నదని షోరూం సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల తీసుకొచ్చిన వాహన్ పోర్టల్‌పై సైతం షోరూంల నిర్వాహకులకు అవగాహన లేకపోవడంతో సేవలు సకాలంలో అందడం లేదని వాహనదారులు చెప్పారు.