న్యూఢిల్లీ: డ్రైవరే యజమానిగా ఉండే రైడ్ హెయిలింగ్ సర్వీస్ భారత్ ట్యాక్సీ సేవలు వచ్చే నెల 1 నుంచి ఢిల్లీలో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో దూసుకుపోతున్న ఉబర్, ఓలా, ర్యాపిడోలకు ఇది సవాల్ విసురుతుందని భావిస్తున్నారు. భారత్ ట్యాక్సీని సహకార్ ట్యాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్ ప్రమోట్ చేస్తున్నది. ఆటో రిక్షాలు, కార్లు, బైక్ ట్యాక్సీలు ప్రయాణికులకు సేవలందిస్తాయి. ఇప్పటికే ఈ ప్లాట్‌ఫాంలో దాదాపు 56,000 మంది డ్రైవర్లు నమోదు చేసుకున్నారు. ఛార్జీల్లో సుమారు 80 శాతం వరకు డ్రైవర్లు పొందుతారు. కమీషన్ బేస్డ్ అగ్రిగేటర్స్‌తో పోల్చితే ఇది చాలా ఎక్కువ. డ్రైవర్-యాజమాన్యంలో ప్రయాణ సేవలందించే వ్యవస్థల్లో భారత్ ట్యాక్సీ ప్రపంచంలోనే అతి పెద్దది. ప్రయాణికుల కోసం దీని బీటా ట్రయల్స్ మంగళవారం ఢిల్లీలో ప్రారంభమయ్యాయి.