న్యూఢిల్లీ, జనవరి 19: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్(భెల్) అంచనాలకుమించి రాణించింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను రూ.390.40 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. కీలక విభాగాల నుంచి ఆదాయం భారీగా పెరగడం వల్లనే నికర లాభం మూడింతల వృద్ధి నమోదైందని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది.
గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.134.70 కోట్ల నికర లాభాన్ని గడించింది. మరోవైపు, సమీక్షకాలంలో కంపెనీ మొత్తం ఆదాయం ఏడాది ప్రాతిపదికన 18 శాతం ఎగబాకి రూ.8,692.85 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.7,385 కోట్లుగా ఉన్నది. దీంట్లో పవర్ సెగ్మెంట్ నుంచి రూ.6,322 కోట్ల ఆదాయం సమకూరగా, ఇతర మార్గాల నుంచి మరో రూ.2,150 కోట్లు లభించాయి.