న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: మోసపూరిత జాబ్ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగార్ధులను హెచ్చరించింది. ఉద్యోగార్థులను తప్పుదోవ పట్టిస్తూ కొందరు మోసపూరిత వ్యక్తులు.. ఐటీ శాఖలో చేరేందుకు నకిలీ అపాయింట్మెంట్ లేఖల్ని జారీచేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆదాయపు పన్ను శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) లేదా తమ శాఖ అధికారిక వెబ్సైట్లలోని జాబ్ ఆఫర్లు లేదా ప్రకటనల్ని మాత్రమే అభ్యర్థులు పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. గ్రూప్ బీ, సీ పోస్టులకు ఎస్ఎస్సీ నిర్వహించే పరీక్ష ద్వారా నేరుగా రిక్రూట్మెంట్ జరుగుతుందని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్/ఫలితాలు ఎస్ఎస్సీ వెబ్సైట్లో ఉంటాయని ఐటీ శాఖ వివరించింది. ఎస్ఎస్సీలో ఎంపిక జరిగిన తర్వాత అభ్యర్థికి ప్రాంతాన్ని కేటాయించి, జాబితాను ఐటీ డిపార్ట్మెంట్ పోర్టల్లో అప్లోడ్ చేయనున్నట్టు పేర్కొంది. ఈ కారణంగా ఎస్ఎస్సీ, ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్లు మినహా ఏ ఇతర ప్లాట్ఫామ్/పోర్టల్ ద్వారా సర్క్యులేట్ అయ్యే మోసపూరిత అడ్వర్టైజ్మెంట్లు/నోటిఫికేషన్లు/అపాయింట్మెంట్ లెటర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.