వరంగల్, డిసెంబర్ 14: పల్లె దవాఖనాల్లో మెరుగైన వైద్యం అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ సూచిచారు. హనుమకొండ డీఎంహెచ్‌వో కార్యాలయంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల వైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కరోనా నియంత్రణలో భాగంగా చేపట్టిన టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. జిల్లాలో మాతా, శిశు సంరక్షణ సేవలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. గర్భిణులకు శస్త్ర చికిత్సలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్‌లో భాగంగా డయాబెటిస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్లను గుర్తించి పూర్తి స్థాయి చికిత్స అందించాలని వివరించారు.
అనుమానిత క్షయ రోగులను గుర్తించి వందశాతం చికిత్స అందించాలని ఆదేశించారు. వైద్యాధికారులు టెలీమెడిసిన్ ద్వారా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణకు అధికారులు పూల మొక్క అందజేశారు. సమావేశంలో హనుమకొండ డీఎంహెచ్‌వో డాక్టర్ లలితాదేవి, వరంగల్ డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ, రెండు జిల్లాల ప్రోగ్రాం అధికారులు, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.