Beth Mooney : మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన బేత్ మూనీ అవకాశం దక్కించుకుంది. ఈ ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ గుజరాత్ జెయింట్స్ కెప్టెన్‌గా ఎంపికైంది. బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఈమె ఈ ఫ్రాంఛైజీని నడిపించనుంది. వైస్ కెప్టెన్‌గా భారత స్పిన్నర్ స్నేహ్ రాణా సెలెక్ట్ అయింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మొదటి సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం అవుతుంది అనగా గుజరాత్ జెయింట్స్ మూనీని కెప్టెన్‌గా ప్రకటించడం విశేషం. వేలంలో మూనీని ఈ ఫ్రాంఛైజీ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.
‘డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్లో గుజరాత్ జెయింట్స్ కెప్టెన్‌గా నియామకం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంట్ జట్టు మొత్తం బ్రాండ్ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉంది. మా టీమ్ డబ్ల్యూపీఎల్ ట్రోఫీ గెలుస్తామని నమ్ముతున్నాను. స్నేహ్ రాణా వైస్ కెప్టెన్‌గా, మిథాలీ రాజ్ మెంటార్‌గా , రాచేల్ హయనెస్, నూషిన్ అల్ ఖదీర్ ఉండడం అద్భుతం’ అని మూనీ తెలిపింది. మహిళల ప్రీమియర్ లీగ్ మార్చి 4న ముంబైలో ప్రారంభం కానుంది. అదేరోజు డీవై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.
ఇరవై తొమ్మిదేళ్ల బేత్ మూనీకి పొట్టి ప్రపంచకప్‌లో మెరుగైన రికార్డు ఉంది. 83 మ్యాచ్‌లు ఆడిన ఆమె 124.60 స్ట్రయిక్ రేటుతో 2,350 రన్స్ చేసింది. అంతేకాదు ఈ ఫార్మాట్లో రెండు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు బాదింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో మూనీ చెలరేగింది. ఆస్ట్రేలియా ఆరోసారి టీ20 ఛాంపియన్ కావడంలోకీలక పాత్ర పోషించింది. 53 బంతుల్లోనే 74 రన్స్ చేసింది. దాంతో, ఆసీస్ 156 పరుగులు చేసింది. 157 టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 137కే పరిమితమైంది.