Bengalore : కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లోని ఓ సినిమా థియేటర్లో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకులు సినిమా చూస్తుండగానే పైకప్పులోని కొంత భాగం హఠాత్తుగా కూలిపోవడంతో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం పీణ్య (Peenya) లోని భారతి థియేటర్ (Bharati Theater) లో బుధవారం జరిగింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో థియేటర్లో సినిమా ప్రదర్శన కొనసాగుతున్నది. అదే సమయంలో పైకప్పుకు సంబంధించిన ప్లాస్టరింగ్, ఆస్ఫాల్టిక్ షీట్లు ఒక్కసారిగా ఊడి ప్రేక్షకులపై పడ్డాయి.
ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిని తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం లేదని తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన వెంటనే థియేటర్ సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. కూలిన పైకప్పు భాగానికి తాత్కాలికంగా మరమ్మతులు చేసి, సినిమా ప్రదర్శనను తిరిగి కొనసాగించారు. అయితే ఈ ఘటనతో అసౌకర్యానికి గురై వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ప్రేక్షకులకు యాజమాన్యం టికెట్ ధరను తిరిగి చెల్లించింది.