ప్రముఖ బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ (42) పడవ ప్రమాదంలో దుర్మరణం చెందారు. టెలివిజన్ షో ‘భోలే బాబా పర్ కరేగా’ చిత్రీకరణలో భాగంగా ఒడిశాలోని తల్సరి బీచ్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. షూటింగ్ సమయంలో రాహుల్ బెనర్జీ పడవపై నుంచి అదుపు తప్పి సముద్రంలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సినిమా యూనిట్ ఆయన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు బాలాసోర్ పోలీసులు తెలిపారు.
‘చిరోదిని తుమీ జే అమర్’ (2008) చిత్రంతో రాహుల్ బెనర్జీ బెంగాలీ పరిశ్రమలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత లవ్ సర్కస్, కాగోజర్ బౌ వంటి చిత్రాలతో పాటు టెలివిజన్ షోలు, వెబ్‌సిరీస్‌ల ద్వారా బెంగాలీ ప్రేక్షకులకు చేరువయ్యారు. రాహుల్ బెనర్జీ మృతి బెంగాలీ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాహుల్ బెనర్జీ మరణం తనను షాక్‌కు గురిచేసిందని, అద్భుత ప్రతిభావంతుడైన నటుణ్ణి కోల్పోయామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సోషల్‌మీడియా సందేశంలో విచారం వ్యక్తం చేశారు.