ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సువర్ణలత (86) సోమవారం ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆమె వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రకాష్‌రాజ్ సినీ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఆయన తల్లి సువర్ణలత కీలక పాత్ర పోషించారు. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులను అధిగమించడంలో తన తల్లి మద్దతుగా నిలిచిందని ప్రకాష్‌రాజ్ పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు.
తల్లితో ఎంతో ఆత్మీయ అనుబంధం కలిగిన ప్రకాష్‌రాజ్ షూటింగ్ విరామ సమయాల్లో ఆమెను తరచుగా కలుస్తుండేవారు. ఆమె తనకు కేవలం తల్లి మాత్రమే కాదని జీవితానికి గొప్ప ప్రేరణ అని ప్రకాష్‌రాజ్ అనేక ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. సువర్ణలత మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం తెలిపారు. ‘శ్రీమతి సువర్ణలతగారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. ప్రకాష్‌రాజ్, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ఎక్స్ వేదికగా అగ్ర నటుడు పవన్‌కల్యాణ్ సంతాపం తెలిపారు.