అగ్ర హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం తన 22వ సినిమాతో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో ‘ఏఏ22’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా ఇప్పటికే అరవైశాతానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దీని తర్వాత లోకేష్ కనకరాజ్, సుకుమార్ చిత్రాలను బన్నీ అంగీకరించారు. తాజాగా ఈ లైనప్‌లో మరో సినిమా చేరింది. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన 25వ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని నేషనల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. సూపర్‌హీరో చిత్రం ‘మిన్నాల్ మురళి’తో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు బాసిల్ జోసెఫ్.
కామెడీ, ఫాంటసీ, యాక్షన్ అంశాలతో జనరంజకంగా చిత్రాల్ని తీర్చిదిద్దుతాడని ఆయనకు పేరుంది. ఇటీవలే బాసిల్ జోసఫ్ వినిపించిన కథకు బన్నీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని, తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉందని తెలుగు ఫిల్మ్‌వర్గాల్లో వినిపిస్తున్నది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సుకుమార్ సినిమాతో సమాంతరంగా ‘ఏఏ25’ తెరకెక్కే అవకాశముందని టాక్. అయితే ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.