హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడమే ఆలస్యం రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు మూటా, ముల్లెలతో కేరళ బాట పడుతున్నారు. ఐదు రాష్ర్టాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏఐసీసీ.. తెలంగాణ నుంచి వచ్చే నిధుల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేరళలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్న ఏఐసీసీ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది.
ఆయనను స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. దీంతోపాటు అసెంబ్లీ ఎన్నికలకయ్యే మంచీచెడుల బరువు బాధ్యతలన్నీ తెలంగాణ కాంగ్రెస్ నేతల మీదనే పెట్టినట్టు సమాచారం. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదటి విడతలోనే ఏప్రిల్ 9న పోలింగ్ ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగానే, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేరళ వెళ్లిపోయారు. అక్కడి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.
సోమవారం రాత్రి బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో మరికొందరు నేతలు కూడా కేరళకు తరలివెళ్తున్నారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణ నేతలు మాత్రం కేరళ మీదనే ఎక్కువగా దృష్టిపెట్టినట్టు సమాచారం. ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. దీంతో అకడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, వ్యవహారం అంతా తెలంగాణ సీఎం కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు సమాచారం. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రి అజారుద్దీన్ కేరళ వెళ్తారని విశ్వసనీయంగా తెలిసింది. పోలింగ్‌కు కేవలం 9 రోజులే ఉన్న నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గంలో 60% మంది మంత్రులను కేరళకు తీసుకెళ్తున్నట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి.
ఈశాన్య రాష్ట్రం అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఇకడ ప్రధానంగా ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటముల మధ్య ద్విముఖ పోటీ నెలకొన్నది. అభివృద్ధి, స్థానికత, సంక్షేమ పథకాలే ఎజెండాగా పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార, పొన్నం ప్రభాకర్‌ను ఈశాన్య రాష్ర్టాల స్టార్ క్యాంపెనర్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క ముందుగా సీఎంతో కలిసి కేరళ వెళ్తారని, అక్కడి నుంచి పుదుచ్చేరి వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థుల ఎంపిక, టికెట్ల ఖరారు వంటి కీలక బాధ్యతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చూసుకుంటారని ఏఐసీసీ ప్రతినిధులు చెప్పారు. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఈసారి రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా ఉన్నట్టు సమాచారం. ప్రముఖ సినీ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేయడంతో సంప్రదాయ పార్టీలైన ఎండీకే, ఏఐఏడీఎంకేకు గట్టి పోటీ ఎదురవుతున్నదనే అంచనాలున్నాయి. ఈనేపథ్యంలో ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ కీలక భూమిక పోషించే విధంగా ఏఐసీసీ ప్రయత్నాలు చేస్తున్నదని తెలిసింది.