చిన్నప్పుడు నాంపల్లి నుమాయిష్ (పారిశ్రామిక ప్రదర్శన)కు వెళ్లిన వారికి గుర్తుండే ఉంటుంది. అజంతా గోడ గడియారాల ప్రకటన విన సొంపుగా ఉండేది. ఒకానొక దశలో అందమైన అజంతా గడియారాలు.. దేశాన్ని ఒక ఊపు ఊపాయి. భారత్‌లోనే కాదు.. 45 దేశాల్లోని ఇంటి గోడలను అలంకరించాయి. నెలకు 55 రూపాయల జీతంతో బతికే ఒక సైన్స్ టీచర్ మదిలో మెదిలిన ఆలోచన.. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి ఊపిరిపోసింది. వేలమంది మహిళలకు ఉపాధి కల్పించింది. ఆ సైన్స్ టీచర్ మరెవరో కాదు.. ఓదవ్జీ రాఘవ్జీ పటేల్. ఆయన విజయ ప్రస్థానం.. ఈవారం!
అజంతా గోడ గడియారాలతో మొదలై.. ఇంతింతై వటుడింతై అన్నట్టు మహా సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడుపుతున్నారు ఓదవ్జీ రాఘవ్జీ పటేల్. గోడ గడియారాలకే పరిమితమై ఉంటే.. కాలం తెచ్చిన మార్పులతో వారి సంస్థ ఎప్పుడో మాయమయ్యేది. కానీ, ఎన్ని ఆటంకాలు ఎదురైనా వట వృక్షంలా నిలబడింది కాబట్టే.. అజంతా వ్యవస్థాపకుని గురించి తెలుసుకుంటున్నాం. 2000 సంవత్సరం ఆరంభంలో.. నోకియా సెల్‌ఫోన్ ఈ ప్రపంచాన్ని ఏలేసింది. ఫోన్ అంటే.. నోకియానే! అన్నట్టుగా అనిపించేది. ఒక దేశ జీడీపీ మొత్తం.. నోకియా సంస్థపైనే ఆధారపడి ఉండేది. అలాంటి నోకియా.. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోలేక మూతబడిపోయింది. కానీ, ఒక సాధారణ సైన్స్టీచర్ మాత్రం టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ వచ్చారు. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు.
ఓదవ్జీ రాఘవ్జీ పటేల్‌ది గుజరాత్‌లోని మౌర్భి. 55 రూపాయల జీతంతో సైన్స్ టీచర్‌గా పని చేసేవారు. 1960 -70 ప్రాంతంలో ఉపాధ్యాయుల జీతాలు అంతంత మాత్రంగానే ఉండేవి. గొర్రె తోక బెత్తెడు అన్నట్టు.. ‘ఇలా ఎంతకాలం?’ అని ఆలోచించారు ఆయనతోపాటు మరో ఇద్దరు మిత్రులు. గోడ గడియారాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. 1971లో ‘అజంతా బ్రాండ్’ను ప్రారంభించారు. అంతకు ముందు ‘కీ’ ఇస్తేనే పనిచేసే వాచ్‌లు మాత్రమే ఉండేవి. ఒకరకంగా ఆ రోజుల్లో ఇంట్లో వాచ్ ఉంది అంటే.. కాస్త సంపన్నులే అన్నమాట. అలాంటి సమయంలో అజంతా గడియారాలు మార్కెట్లోకి వచ్చాయి. పెద్ద యంత్రాలు ఏమీ లేకుండా.. ఇంట్లోనే గడియారాన్ని అసెంబ్లింగ్ చేసేవారు. అయితే.. ఈ ముగ్గురు మిత్రులకూ వ్యాపార అనుభవం లేదు. దాంతో వరుసగా మూడేళ్లు నష్టాలే ఎదురయ్యాయి. దాంతో.. ఇక తమవల్ల కాదంటూ ఇద్దరు మిత్రులు బయటికి వెళ్లిపోయారు.
ఓదవ్జీ రాఘవ్జీ పటేల్ మాత్రం.. ఈ వ్యాపారంలో మంచి భవిష్యత్తు ఉందని గట్టిగా నమ్మారు. 1970లో మనదేశంలో టెక్నాలజీ అంతంత మాత్రమే. ఆ సమయంలో గడియారాల తయారీలో జపాన్ అమోఘమైన ప్రగతి పథంలో పయనిస్తున్నది. దాంతో రాఘవ్జీ జపాన్ వెళ్లి.. అక్కడి ప్రముఖ కంపెనీలను సందర్శించారు. వారి దగ్గర నైపుణ్యంలో శిక్షణ పొంది.. తిరిగి వచ్చి అందమైన డిజైన్లతో అజంతా క్వార్ట్జ్ వాచీల తయారీని ప్రారంభించారు. కాలంతోపాటే.. గడియార వ్యాపారాల్లోనూ అనేక మార్పులు వచ్చాయి. పెద్దపెద్ద సంస్థలు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. దాంతో, గోడ గడియారాలకే పరిమితమైతే దెబ్బ తింటామని గ్రహించి.. తన వ్యాపారాన్ని ఇతర రంగాలకు విస్తరించడం మొదలుపెట్టారు. సంస్థ పేరును ‘అజంతా ఇండియా లిమిటెడ్’గా మార్చి.. టెలిఫోన్లను తయారు చేశారు. అజంతా టూత్ బ్రష్, టూత్‌పేస్ట్ మొదలుకొని.. ఇంటికి అవసరమైన మిక్సీ, గ్రైండర్, ఫ్యాన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎల్సీడీ మానిటర్లు, మొబైల్ ఫోన్, ఎల్ఈడీ స్ట్రీట్‌లైట్స్, ట్యూబ్ లైట్లు ఇలా తీరొక్క వస్తువులను తయారుచేస్తున్నారు.
అజంతా గోడ గడియారాల వ్యాపారం మెల్లగా ఊపందుతున్న సమయంలో.. సంస్థలో పనిచేయడానికి పెద్ద ఎత్తున కార్మికులను తీసుకున్నారు. తన భార్యతో కలిసి ఇంటింటికీ వెళ్లి.. తమ కంపెనీలో పని చేయమని అక్కడి మహిళలను ఒప్పించారు. దాదాపు ఐదు వేల మంది మహిళలు ఈ కంపెనీలో పని చేసేవారు. ఇప్పటికీ వీరి కంపెనీల్లో 85 శాతం మంది మహిళా కార్మికులే ఉంటారు. ప్రస్తుతం గుజరాత్‌తోపాటు హిమాచల్‌ప్రదేశ్‌లో 36,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తయారీ యూనిట్లు ఉన్నాయి. వాస్తవానికి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఆస్తిపాస్తుల సమాచారం ఎక్కువగా బహిర్గతం కాదు. అయితే 2017 నాటికే.. వీరి ఆపరేటివ్ రెవెన్యూ రూ.100 కోట్ల వరకూ ఉంది. చైనా, యూఏఈ, హాంకాంగ్, థాయిలాండ్ వంటి దేశాల్లో కూడా వీరి కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయి. 2012లో పటేల్ జీ మరణించగా.. ఆయన కుమారుడు అశోక్ ఓ పటేల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన కూడా 16 ఏళ్లకే గోడగడియారాల మార్కెటింగ్ చూసేవారు. దాదాపు మూడు దశాబ్దాల మార్కెటింగ్ అనుభవంతో.. అజంతా ఇండియా లిమిటెడ్ కంపెనీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కాలానికి తగ్గట్టు మారితేనే నిలబడతామని చాటిచెప్పిన బ్రాండ్.. అజంతా. టెక్నాలజీ వేగంగా మారుతున్నది. మహామహా బహుళ జాతి కంపెనీలే మార్పును తట్టుకోలేక మాయమవుతున్నాయి. కానీ, కాలానికి తగ్గట్టు మారుతూ.. ఓ మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన ‘ఓదవ్జీ రాఘవ్జీ పటేల్’ నిజంగా గొప్ప విజేతే!