Sunnam Cheruvu | కందుకూరు, మే 26 : ఒకప్పుడు ఆ చెరువు కట్టకు ఇరువైపులా అడవిలా ఉండేది. ఎక్కడ చూసినా చుట్టూ ముళ్ల కంచ, పూర్తిగా శిథిలావస్థమై ఎప్పుడు తెగిపోతుందో తెలియని పరిస్థితి. దీంతో రైతులతో పాటు మత్స్యకారులు ఆందోళన చెందేవారు, కట్టపై నడవడానికి దారి సక్రమంగా లేక ఏళ్లుగా అలుగుపై ఇబ్బందులు పడుతున్న తరుణం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని కొత్తగూడ సున్నం చెరువు పరిస్థితి. ఈ తరుణంలో అమెజాన్ సంస్థ దత్తత తీసుకొని అభివృద్ధి, సుందరీకరణ చేయడానికి ముందుకు వచ్చింది.
అమెజాన్ సంస్థ చేపట్టిన ఈ సుందరీకరణ పనుల్లో భాగంగా ముందుగా కట్టకు ఇరువైపులా ఉన్న ముళ్ల కంచెను తొలగించారు. అనంతరం కట్ట మరమ్మతు చేశారు. ఈ క్రమంలో అరకిలోమీటర్ వరకు ఉన్న కట్టను వెడల్పు చేసి రాతి కట్టడాలను ఏర్పాటు చేశారు. అలాగే అలుగుకు మరమ్మతులు చేశారు. చెరువు కట్ట పటిష్టం చేయడంతో పాటు మహిళలు బతుకమ్మలు ఆడుకోవడానికి అన్ని వసతులను కల్పించారు. కట్ట మరమ్మతులతో పాటు చెరువులోకి నీరు ప్రవహించేలా పనులు చేపట్టారు. చెరువు నిండిన తర్వాత అలుగు ద్వారా గొలుసు కట్టు కాలువలు నుంచి రాచులూరు, తిమ్మాపూర్, చెరువులో నుంచి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోకి నీరు చేరుతుంది .
సున్నం చెరువు మరమ్మతు కారణంగా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారి చెరువు నిండితే సున్నం చెరువు కింద ఉన్న 246 ఎకరాల ఆయకట్టులో సాగుకు లోటు ఉండదు. సమీప గ్రామాల్లోనూ భూగర్భ జలాల పెంపునకు ఇది దోహదపడుతుంది. అలాగే రెండేళ్ల వరకు మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. కాగా, అమెజాన్ సంస్థ నిధులతో సున్నం చెరువును అభివృద్ధి చేయడంపై సమీప గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ సంస్థకు రుణపడి ఉంటామని చెబుతున్నారు.