ఆధునిక జీవితంలో ప్లాస్టిక్ అనివార్యమైపోయింది. ఆహార పదార్థాలు ఆర్డర్ ఇచ్చినా, కిరాణా సరుకులు తెచ్చుకోవాలన్నా ప్లాస్టిక్ లేకుండా పని జరిగే అవకాశం లేదు. మన శరీరానికి చేటు చేస్తుందని ఎన్ని హెచ్చరికలు వచ్చినా, ప్లాస్టిక్ డబ్బాల్లో తిండి మామూలు విషయమైపోయింది. అయితే, సైన్స్ డైరెక్ట్ అనే జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఒకటి ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ ఉంచిన, వేడి చేసిన ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరించింది. దీనివల్ల కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్తోపాటు పొట్టలో ఉండే సూక్ష్మజీవుల వ్యవస్థలో కూడా మార్పులు వస్తాయని హెచ్చరించింది. దీంతో ఇన్ఫ్లమేషన్, రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతినడం లాంటి ప్రమాదాలు ఉంటాయని పేర్కొన్నది.
పరిశోధకులు తమ అధ్యయనం కోసం చైనాలో మూడువేల మందిని రెండు విభాగాలుగా చేశారు. అంతేకాకుండా ప్లాస్టిక్ ఆహార డబ్బాలకు గుండెజబ్బులకు లంకె ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి ఎలుకల మీద కూడా పరిశోధన చేశారు. ఇందులో ప్లాస్టిక్ డబ్బాల నుంచి మైక్రో ప్లాస్టిక్ కణాలు ఆహారంలోకి వెళ్లి, దాన్నుంచి మన పొట్టలోకి ప్రవేశించినట్టు పరిశోధకులు గ్రహించారు. ప్లాస్టిక్ కణాల్లోని రసాయనాలు పొట్ట లైనింగ్ దెబ్బతినడానికి కారణమవుతున్నట్టు తెలుసుకున్నారు. అంతేకాదు, ఈ రసాయనాలు పొట్టలో ఉండే సూక్ష్మజీవుల వ్యవస్థను మార్పు చెందిస్తాయి. అలా ఇన్ఫ్లమేషన్, రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతినడానికి కారణమవుతున్నాయి. ఇది పేగులు నీళ్లను వడగట్టే క్రమంలో హానికరమైన కణాలు రక్త ప్రవాహంలో కలిసిపోతున్నాయి. ఇలా జరగడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థకు కీడు కలుగుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, ఈ అధ్యయనం మన ఆరోగ్యానికి ఏ రసాయనాలు హానికరమో ప్రత్యేకంగా గుర్తించలేదు. బైస్ఫినాల్ ఏ (బీపీఏ), థాలేట్స్, పీఎఫ్ఏలు లాంటివాటితో ఆరోగ్య సమస్యలు ఉంటాయని తెలిపారు.