చుంచుపల్లి, మే 27 : అకాల వర్షాల పట్ల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. బుధవారం చుంచుపల్లి మండలం పెనగడప ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు, కొనుగోలు ప్రక్రియ, లోడింగ్, రవాణా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కేంద్రంలో సుమారు 1,200 క్వింటాళ్ల ధాన్యం నిల్వలు ఉన్నాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ ధాన్యాన్ని సుజాతనగర్లోని రైస్ మిల్కు రెండు రోజులలోపు తరలించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అకాల వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, కవర్లు ఏర్పాటు చేసి పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షపు నీరు ధాన్యం నిల్వల వద్ద చేరకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలిస్తూ లోడింగ్, రవాణా పనులను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ఈ పరిశీలనలో డీసీఓ ప్రేమ్ కుమార్, డీఎం సతీశ్, చుంచుపల్లి తాసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ సుభాషిని, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.