‘గమ్మత్ ఆశన్న-లింబవ్వ’కు మేం నలుగురం కొడుకులం, మాకిద్దరు ఆడిబిడ్డలు. మా అవ్వ-బాపు పేర్లు గమ్మతిగున్నయేందని పరేషాన్ అయితున్నరా? అట్లేం గాకుర్రి. వాళ్లే మా ఇమ్మతి. లేబర్లకు ఆక్ తంబాక్ ఇచ్చుడు బాపు జేసే పని. బీడీలు ఎంచుకునుడు అవ్వ జేసే పని. అంటే బీడీల కంపెనీకి ఏజెంట్లమన్న మాట. వీళ్లకుతోడు ఇంటి ఆరుగురం నపరో సార్గం జేసేటోళ్లం. ఏండ్లవట్టి ఏళ్లనాడిచ్చుడే మా పని. బీడీలు సుట్టని రోజు మా శెయ్యిలకు బేడీలేసినట్టే అనిపిస్తది.
అన్నలకు, అక్కాచెల్లెండ్లందరికి పెండ్లిళ్లయి, ఎక్కడోళ్లక్కడ ఏరువడ్డరు. ఎనిమిది మందితో ఎప్పుడూ కళకళలాడే కార్ఖానా ఆఖరికి నల్గురుతోని సిన్నవోయింది. అవ్వ-బాపు, నేను(గమ్మత్ శ్రీనివాస్)-నా పెండ్లాం లక్ష్మి. పదో తరగతి దాన్క సుదువుకున్న నేను కార్ఖానాను ముగ్గురికి అప్పజెప్పి దుబాయికి వోయిన. అక్కడ నాకు కట్టెమిషన్ల లేబర్ పని దొర్కింది. నాలుగైదేండ్లు అదే పన్జేసిన. ఓ దిక్కు కట్టెమిషిన్లు పన్జేసుకుంటున్న నాకు బాపు జరిగిపోయిండనే మతలవ్ అందింది. బాపుతో ఉన్న యాది అంతా ఒక్కసారిగా కం డ్లముందు మెరిసింది. బాపు లేని బీడీల కార్ఖానాకు కాళ్లిరిగినంత పనయింది. ఇగ లాభం లేదు, ఇంకెన్నొద్దులు ఈ దుబయి లుంటనని నాది నేనే మన్సులనుకున్న. నా ఇంటికి నేను వోతనని మనసు కఠినం జేస్కొ ని పెట్టా, బేడ సదురుకున్న.
నిజాంబాద్ జిల్లా, కమ్మర్పల్లి మండలం, కోనసముద్రంల పుట్టిన నా ఊరికి జేరుకున్న. అప్పటికే అన్నలెక్కడోళ్లక్కడ సెటిలైర్రు. కావట్టి బాపు కార్ఖానా ఇప్పుడు నేనే నడిపిస్తున్న. అవ్వ లింబవ్వకు దగ్గెర దగ్గరె ఎనభై ఏండ్లుంటయి. అయినా ఇప్పటికీ బీడీలు ఎంచుకుంటది, ఆక్ తంబాక్ వంచుతది. నాకు ఇమ్మత్ అవ్వనే. నాకు నలుభై ఆరుంటె, లక్ష్మికి నలు భై రెండు ఏండ్లుంటయి. బాపిచ్చిన కార్ఖానను మూడింతలు జేసిన. కోనసముద్రం, దమ్మన్నపేటల ఉండే ‘చార్బాయ్’ బ్రాంచులకు నేనే ఏజెంట్‌ను. నల్గురన్నదమ్ములు గల్సి ఆ కంపెనీని నడిపిస్తరు కావట్టి కంపెనీ పేరు ‘చార్‌బాయి’ అని వెట్టుకున్నరట. దొంతళ్ల ఉండే ‘దంతాల్’ బీడీ కంపెనీకి గూడ నేనే ఏజెంట్‌ను. మా సేట్లు, మా లేబర్లే మాకు సుట్టాలు. ఏం దిన్నా, ఏం తాగిన ఆళ్లతోనే. మా బీడీల కుటుంబం మస్తు పెద్దదని సంబురవడుతం. నా దగ్గర మొత్తం 150 మంది ఆడోళ్లు బీడీల్జేత్తరు. దగ్గెర దగ్గెర అందరికీ ప్రభుత్వం నుంచి నెలకు 2,016 రూపాల బీడీల పింఛన్ అందుతది. వాళ్ల కట్టానికి తోడు కేసీఆర్ సాయం గూడ ఇంత అందేసరికి ‘అంతకంతే ఆసరా’ అని ఆళ్లు కుషీ అయితరు. మావోళ్లు రోజుకోపారన్న కేసీఆర్‌ను యాజ్జేసుకోకుండ ఉండరు. అన్నట్లూ… బాపు జరిగిపోయిండు గావట్టి అవ్వగ్గూడ ఆస రా పింఛన్ అస్తున్నది. మేం నలుగురన్నదమ్ములమైనా ‘కేసీఆరే నా పెద్ద కొడుక’ని మా లింబవ్వ లావ్ సంబురవడ్తది.
మొదుగాళ్ల మా బాపు బీడీల గంపను సైకిల్ మీద వట్కపొయ్యేటోడు. ఇప్పుడు నేను అదే బీడీల గంపను బండి మీద వట్కపోతున్న. నాకు-లక్ష్మికి ఇద్దరు మొగపోరగాండ్లు, ఒక ఆడివిల్ల. పెద్దోడు ఎంబీఏ జేసిం డు, సిన్నోడు బీటెక్ జేసిండు. వీళ్లను సదివిపియ్యడానికే తలాపానం తోకలకచ్చింది. కర్సు పెట్టీ పెట్టీ నెరివడ్డ. ఇగ బిడ్డ కళ్యాణినేం సదివిపిద్దాం తియ్ అని తిరంగున్న. కళ్యాణికి కల్యాణం జేసి ఓ అయ్యజేతిల వెడ్తె ఐపాయె అనుకునే మోపున…
మొన్న.. ‘డాడీ.. డాడీ.. నాకు డాక్టర్ సీటొచ్చింద’ని బిడ్డ కళ్యాణి జెప్పవట్టింది. ఉత్తగున్నప్పుడల్లా బిడ్డ కళ్యాణి ‘డాడీ… నేను డాక్టర్నైతా.. నేను డాక్టర్నైతా…’ అని ఊకే అనేది. ‘గంత పెద్ద సదువు మనతోనేడైతది బిడ్డా.. పైసలున్నోళ్లే డాక్టర్లయితరట గదా..?’ అని నేను కొట్టిపారేసేది. ‘లేదు డాడీ.. నేను మంచిగ సదువుకొని గవర్నమెంట్ సీటు దెచ్చుకుంట’నని నా బిడ్డ నాతోని షర్తు గట్టింది.
మహబూబ్‌నగర్ జిల్లా అప్పన్నపల్లెల ‘ఎస్వీఎస్ డెంటల్ కాలేజీ’ల కన్వీనర్ కోటా కిం ద బీడీఎస్ సీటు దొరికిం ది. ఇప్పటికే మా ఊళ్లే ‘బీడీల సీను బిడ్డకు బీడీఎస్ సీటొచ్చిందట గదా?’, ‘బీడీల సీను బిడ్డ డాక్టరైందట కదా?’ అని ముచ్చట వెట్టుకుంటున్నరు.
గడ్డం సతీష్: 99590 59041