కాచిగూడ, మార్చి 23: బీసీ కులంలో పుట్టిన ప్రతిబిడ్డ హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బుధవారం కాచిగూడలో నిర్వహించిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. 70 కోట్ల మంది బీసీల హక్కులను కేంద్రం కాలరాస్తున్నదని, దేశ ప్రధాని బీసీగా ఉండి బీసీలకే అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న అన్ని రాజకీయ పార్టీలతో పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. 30న అఖిలపక్ష నేతలతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, గుజ్జ సత్యం, నీలం వెంకటేశ్, జయంతిగౌడ్, రాఘవ, రామకృష్ణ, ఉదయ్, లక్ష్మణ్యాదవ్, చరణ్ పాల్గొన్నారు.