మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన తమిళ బ్యూటీ సాయిపల్లవి. అందం, అభినయంతోపాటు వ్యక్తిత్వంతోనూ అందరినీ ఆకట్టుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంది. లెక్క తక్కువే అయినా అదిరిపోయే నటనతో అభిమానులను సంపాదించుకుని లేడీ పవర్‌స్టార్‌గా పాపులర్ అయ్యింది. వరుస సినిమాలతో దక్షిణాదిన రాణిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నది. ఇటీవలే ‘అమరన్’ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ పంచుకున్న కబుర్లు..
నా తొలి చిత్రం ‘ప్రేమమ్’ చేసినప్పుడు నా ముఖం నిండా మొటిమలే. నన్ను ప్రేక్షకులు హీరోయిన్గా ఒప్పుకొంటారా? అనుకునేదాన్ని. కానీ, సినిమా రిలీజ్ అయ్యాక.. ప్రేక్షకులు నన్ను రిసీవ్ చేసుకున్న తీరు నాకెంతో ధైర్యాన్నిచ్చింది. ముఖం ఎంత అందంగా ఉందని కాదు.. ఎంత మంచి పాత్ర చేశామనేదే ముఖ్యమని అర్థమైంది. ఒకప్పుడు మొటిమలతో బాధపడే అమ్మాయిలు.. ఇప్పుడు సాయిపల్లవికి కూడా మొటిమలు ఉన్నాయి కదా? అని అనుకుంటున్నారు. వాటి గురించి పట్టించుకోవడం మానేశారు.
‘శ్యామ్ సింగరాయ్’ సమయంలో నేనున్న చాలా సన్నివేశాలు రాత్రి పూటే చిత్రీకరించారు. రాత్రి షూటింగ్‌లు అస్సలు అలవాటు లేదు. పైగా పగలు నిద్ర వచ్చేది కాదు. దీంతో రాత్రిళ్లు నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ సినిమా చేస్తూనే మిగతా సినిమాల షూటింగ్స్‌కు వెళ్లేదాన్ని. విశ్రాంతి లేకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఒకరోజు షూటింగ్ సెట్‌కు మా చెల్లి పూజా కన్నన్ వచ్చింది. ఇక తనతో మాట్లాడుకుంటూ ఏడ్చేశాను కన్నీళ్లు ఆగలేదు.
ఒక జవాన్‌కి వృత్తిపరంగా ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి. దేశం కోసం పోరాటం చేసే అతనికి ఫ్యామిలీ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందనేది అమరన్ సినిమా వల్ల తెలుసుకున్నా. నటిస్తుంటేనే నాకు ఏడుపు వచ్చిందంటే, ఇక రియల్ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ‘సోల్జర్ను పెళ్లి చేసుకోవలసి వస్తే భయంగానే అనిపిస్తుంది. తప్పదు అంటే నేను స్ట్రాంగ్ అవుతాను. నీతో పాటు నేను కూడా వస్తాను’ అన్న డైలాగ్ చెప్పేటప్పుడు చాలా ఎమోషన్ అయ్యాను.
నన్ను అభిమానించే ప్రేక్షకుల ప్రేమనే తీసుకుంటాను తప్ప ఇమేజ్ గురించి పట్టించుకోను. మంచి సినిమా, కథ చేయాలనే తాపత్రయం ఉంటుంది. ప్రేక్షకులు వైవిధ్యమైన సినిమాలు చూస్తున్నారు. మేకప్ వేసుకుంటే నాపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే నేను బయట ఎలా ఉంటానో అలాగే కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడతాను..
ఫిట్‌గా కనిపించడానికి ప్రత్యేకంగా నేను ఎలాంటి కసరత్తులు చేయను. ఏ మాత్రం ఖాళీ దొరికినా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాను. అదే నా ఫిట్నెస్కి కారణం. నాకు ఎంతో ఇష్టమైన డ్యాన్స్ ఇంతటి పేరు ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుందని ఎప్పుడూ అనుకోలేదు.
రీమేక్ చిత్రాలకు నేను వ్యతిరేకం కాదు. ఏదైనా సినిమా ఒక భాషలో హిట్ అయినప్పుడు మరో భాష ప్రేక్షకులకు చూపించాలని రీమేక్ ద్వారా ప్రయత్నం చేస్తుంటారు. అప్పటికే ఒకరు చేసిన పాత్రను మళ్లీ చేయాలంటే సవాలే! ఆ పాత్ర కంటే బెటర్‌గా చేయాలనే ప్రయత్నంలో కొంత ఒత్తిడికి గురవుతాం. మన ధోరణిలో చేస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్పలేం! అందుకే, నేను రీమేక్ పాత్రలకు కొంచెం దూరంగా ఉంటాను.
నా మాతృభాష తమిళమే అయినా, తమిళంలో డబ్బింగ్ చెప్పడానికే ఎక్కువ సమయం పడుతుంది. తమిళంలో ఒక్కో సినిమాకు ఒకటిన్నర రోజు తీసుకుంటే అదే తెలుగులో సగం రోజులోనే డబ్బింగ్ చెప్పేశాను. మాతృభాష తమిళం కంటే తెలుగులోనే బాగా మాట్లాడుతాను, డైలాగ్ చెబుతానని చాలామంది చెప్పారు. అదెంత నిజమో తెలియదు కానీ నాకు తెలుగు కంఫర్ట్‌గా ఉంటుంది.
నాకు నచ్చిన పాత్రలను, సినిమాలను ఎంపిక చేసుకుంటాను. ప్రస్తుతం ఒక్కో సినిమా చాలా సమయం తీసుకుంటున్నది. అందుకే ఎక్కువ గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తున్నది. ఒక సినిమా కథను రిజెక్ట్ చేయడం ఎంత కష్టమో.. ఒక సినిమా కథను ఒప్పుకోవడం కూడా అంతే కష్టం. కొన్నిసార్లు ఓకే చేసిన కథ సెట్స్‌లో మారిపోతుంటుంది.