ముంబై, ఫిబ్రవరి 9: టెక్నాలజీ సేవల సంస్థ బాష్ లిమిటెడ్ లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.184.25 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నికర లాభం గత త్రైమాసికానికిగాను 27.43 శాతం పెరిగి రూ.234.80 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. అటు ఆదాయంలోనూ ఏడాది ప్రాతిపదికన 2.6 శాతం అధికమై రూ.3,109.08 కోట్లుగా నమోదైంది. కంపెనీ మొత్తం ఆదాయంలో అత్యధిక వాటా కలిగిన దేశీయ ఆటోమోటివ్ మార్కెట్ ఉత్పత్తి 12 శాతం పడిపోగా, విక్రయాలు మాత్రం 3.6 శాతం చొప్పున అధికమయ్యాయి.
ఐదేండ్లలో వెయ్యి కోట్ల పెట్టుబడి
మరోవైపు బాష్ కీలక నిర్ణయం తీసుకున్నది. దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టి వందేండ్లు పూర్తైన సందర్భంగా భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేండ్లలో ఆటోమోటివ్ టెక్నాలజీ కోసం రూ.1,000 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్టు కంపెనీ ఎండీ సౌమిత్రా భట్టాచార్య తెలిపారు.