బన్సీలాల్‌పేట్, మార్చి 27: నదికి నడక నేర్పి.. సరికొత్త నదిని పారించి.. వంద మీటర్ల ఎత్తుకు తరలించి.. కాళేశ్వరం ద్వారా సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చి.. ప్రతినీటి బొట్టును ఒడిసిపట్టారు అపర భగీరథుడు కేసీఆర్. చెత్త చెదారంతో నిండిపోయిన పురాతన మెట్ల బావులను సైతం పునరుద్ధరించి మళ్లీ జీవం పోశారు. ఈ జల సంరక్షణ చర్యలను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఆదివారం నాటి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని.. హైదరాబాద్ బన్సీలాల్‌పేట్‌లో శిథిలావస్థలో ఉన్న పురాతన మెట్లబావిని పునరుద్ధరించడంపై ప్రశంసలు కురిపించారు. దేశంలో పలు ప్రాంతాల్లో జల సంరక్షణ కోసం పాటుపడుతున్న వారిని ప్రధాని అభినందించారు. అడుగంటుతున్న భూగర్భ జలాలను వృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను ప్రతిఒక్కరూ గుర్తించాలని, నీటి సంరక్షణ ఒక యజ్ఞంలాగా నిర్వహించాలని, భవిష్యత్తుతరాలకు సురక్షితమైన నీటిని అందించాల్సిన బాధ్యత మనందరిదని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా బన్సీలాల్‌పేట్‌లో చెత్తాచెదారంతో నిండిన బావిని ఇప్పుడు ప్రభుత్వ, ప్రజల భాగస్వామ్యంతో పునరుజ్జీవం కలిగించారని అన్నారు. ఇలాంటి పురాతన చెరువులను, బావులను కాపాడుకోవడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని మెచ్చుకున్నారు. ఎందుకంటే ఒక్క చుక్క నీటి కోసం అల్లాడుతున్న అనేక వెనకబడిన ప్రాంతాలను తాను స్వయంగా చూశానని చెప్పారు. నీటి సంరక్షణ కోసం పాటుపడుతున్న అపర భగీరథులను తాను అభినందిస్తున్నట్టు పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను కీర్తించారు.