Banks | బ్యాంకులకు సెప్టెంబర్ 26 (నాలుగో ఆదివారం), 27 (ఆదివారం) సాధారణ సెలవు రోజులు. బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చాయి. దీంతో వినియోగదారులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs)ఈ ఆదివారం (సెప్టెంబర్ 27) బ్యాంకులు పనిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకింగ్ సేవలకు వరుసగా ఐదు రోజులు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఆదివారం బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధానిత శాఖలు, కరెన్సీ విభాగాల కార్యకలాపాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. దీంతో వినియోగదారులు ఏవైనా అత్యవసర బ్యాంకింగ్ సేవలను ఈ ఆదివారం వినియోగించుకోవచ్చు. వినియోగదారుల సౌకర్యం కోసం బ్యాంకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే మూడు రోజుల సమ్మెను వాయిదా వేయాలని ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు బ్యాంక్ ఉద్యోగ సంఘాలకు విన్నవించాయి. అలాగే బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.

Strike
సమ్మె ఎందుకు?
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) వరుసగా మూడు రోజులు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు సమ్మెకు పిలుపునిచ్చాయి. బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ప్రధానంగా వారానికి ఐదు రోజులు పనిదినాలు ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పాటు పదవీ విరమణ ఉద్యోగులకు పెన్షన్ పెంచడం, పెన్షనర్లకు కూడా ఉద్యోగులతో సమానంగా డీఏ పెంపుదల, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)కు బదులు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం వంటివి కూడా బ్యాంక్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ మంగళవారం UFBU ప్రతినిధులతో రాజీ చర్చలు నడిచాయి. కానీ ఆ చర్చలు ఎలాంటి ఫలితం లేకుండా ముగిశాయి. మా డిమాండ్‌పై ఏదైనా నిర్దిష్టమైన లేదా సానుకూల హామీ ఇస్తే సమ్మెపై పునరాలోచిస్తామని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి.
సమ్మె కాలంలో బ్యాంకింగ్ అవసరాల కోసం మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, యూపీఐ (UPI) వంటి
డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు వినియోగదారులను కోరుతున్నాయి. సెప్టెంబర్ 30తో బ్యాంకుల అర్ధవార్షికం ముగుస్తుంది.