న్యూఢిల్లీ, నవంబర్ 10: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,088 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.1,679 కోట్ల లాభంతో పోలిస్తే 24 శాతం అధికం. లాభాల్లో భారీ వృద్ధిని నమోదు చేసుకున్న బ్యాంక్‌నకు ఆదాయం మాత్రం స్వల్పంగా తగ్గింది. ఏడాది క్రితం రూ.20,729.31 కోట్లుగా ఉన్న ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.20,270.74 కోట్లకు పరిమితమైంది. సమీక్షకాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 9.14 శాతం నుంచి 8.11 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ మాత్రం 2.51 శాతం నుంచి 2.83 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది.
హైదరాబాద్, నవంబర్ 10: హైదరాబాద్ కేంద్రంగా తెలుగు రాష్ర్టాల్లో హాస్పిటల్స్‌ను నిర్వహిస్తున్న కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఈ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 84.3 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ద్వితీయ త్రైమాసికంలో నమోదుచేసిన రూ.90.2 కోట్లతో పోలిస్తే తాజాగా ముగిసిన క్వార్టర్లో లాభం 7 శాతం తగ్గింది. సంస్థ ఆదాయం మాత్రం 1 శాతం వృద్ధితో రూ. 411.2 కోట్ల నుంచి రూ. 417.1 కోట్లకు చేరింది. సంస్థ ఇటీవల 3 హాస్పిటల్స్ కలిగిన సన్‌షైన్ హాస్పిటల్స్‌ను రూ.350 కోట్లకు కొనుగోలు చేసింది.
హైదరాబాద్, నవంబర్ 10: హైదరాబాదీ కంపెనీ వైస్రాయ్ హోటల్స్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.2.41 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. గతేడాది ఇదేకాలంలో సంస్థ నమోదుచేసిన రూ. 6 కోట్ల నష్టంతో పోలిస్తే తాజా క్వార్టర్లో సగానికిపైగా తగ్గింది. ఆదాయం సైతం రూ. 17.11 కోట్ల నుంచి రూ.12 కోట్లకు తగ్గింది.