వెంగళరావునగర్,ఫిబ్రవరి 8 :ఆ ఖాకీ అవినీతి హద్దులు దాటింది. నెలవారీ మామూలు ఇవ్వలేదనే అక్కసుతో ఓ పాన్ షాప్ నిర్వాహకుడి పై ఆ ఖాకీ కక్ష గట్టాడు. స్టేషన్ పరిధి కాకున్నా మామూళ్ల కోసం పీడించాడు. పాన్ షాపులో ఉన్న బాలుడ్ని అక్రమ నిర్బంధంలోకి తీసుకుని పోలీస్ వాహనం ఎక్కించి..ఆర్ధరాత్రి వేళ బాలుడ్ని స్మశానవాటిక సమీపంలో విడిచి పెట్టాడు. నగరంలోని ఓ కీలకమైన జోన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది..బాధితుల కథనం ప్రకారం..కీలకమైన జోన్ పరిధిలో పాన్ షాప్ ను ఓ చిరు వ్యాపారి నిర్వహించుకుంటున్నారు.ఓ కానిస్టేబుల్ తాను పని చేసే స్టేషన్ పరిధిలోకి వచ్చే పాన్ షాపులు,బేకరీలు, ఫాస్ట్ ఫూడ్ సెంటర్ల వద్ద మామూళ్లు వసూలు చేసుకుంటున్నారు.
అయితే కొద్ది రోజుల క్రితం తాను పని చేసే స్టేషన్ పరిధిలోని రోడ్డు అవతలి వైపు ఉన్న మరో స్టేషన్ పరిధిలోని పాన్ షాప్ నిర్వాహకుడిని నెలవారి మామూలు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. కుటుంబ పోషణ బాధ్యతల వల్ల మాములు ఇచ్చుకోలేనని ఆ పాన్ షాప్ నిర్వాహకుడు అనడంతో అతని పై కానిస్టేబుల్ కక్షగట్టాడు.రెండు రోజుల క్రితం ఇంట్లో శుభకార్యం ఉండటం వల్ల కొద్దిసేపు షాపును చూసుకోవాలని రాత్రి 11 గంటల సమయంలో మేనల్లుడైన బాలుడ్ని కూర్చోబెట్టాడు. అదే అదునుగా కానిస్టేబుల్ భావించాడు. తాను పనిచేసే పీఎస్ పరిధిలోకి ఆ షాపు రాకున్నా పాన్ షాపులోని బాలుడ్ని ఈడ్చుకొచ్చి పోలీసు వాహనం ఎక్కించారు.స్టేషన్ కు తీసుకెళ్తామని కానిస్టేబుల్ చెప్పాడు.
బాలుడ్ని స్టేషన్ కు ఎలా తీసుకెళ్తారని అక్కడికి చేరుకున్న పాన్ షాప్ నిర్వాహకుడు ఆ కానిస్టేబుల్ ను నిలదీశారు. దీంతో సంబంధిత పోలీస్ స్టేషన్ కు బాలుడ్ని అప్పగిస్తానంటూ ఆ కానిస్టేబుల్ తల బిరుసు సమాధామిచ్చాడు. చేసేదిలేక మార్గమధ్యలో ఒక స్మశానవాటిక వద్ద పోలీస్ వాహనంలో నుంచి బాలుడ్ని దింపి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. పాన్ షాప్ వద్దకు పోలీస్ వాహనం వెనక్కి తిరిగి వచ్చింది. రోడ్డు అవతలి వైపు ఉన్న పాన్ షాప్ మరో స్టేషన్ పరిధి కావడంతో..రోడ్డు ఇవతలి వైపునకు పాన్ షాప్ నిర్వాహకుడ్ని అర్ధరాత్రి వేళ నిల్చోబెట్టి ఫొటో తీసి కేసు బుక్ చేశారు. పోలీసుల అమ్యమ్యాల వేధింపులకు పరాకాష్టగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.