నా పేరు శ్రేయస్. ఓ ప్రైవేట్ ఉద్యోగిని. నేను 2018 నుంచి 2022 వరకు ఒక కంపెనీలో, 2022 నుంచి 2025 వరకు మరొక కంపెనీలో పనిచేశాను. అయితే ఆ రెండు కంపెనీలూ వేర్వేరు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ల (యూఏఎన్)తో రెండు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలను తెరిచాయి. ఇటీవలే నేను మరొక సంస్థలో చేరాను. నా గత పీఎఫ్ ఖాతాలను బదిలీ చేసుకోకపోవడం వల్ల ఇప్పుడున్న సంస్థలో పీఎఫ్ సదుపాయాన్ని అందుకోలేకపోతున్నాను. నేను నా పాత ఖాతాలను ఎలా ఒక్కటి చేసుకోగలను? మొదటి ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకోవచ్చా? అందుకు అనుమతిస్తారా? దానిపై పన్ను చెల్లించాల్సి వస్తుందా? మొత్తం నా సర్వీస్ వరుసగా 7 ఏండ్ల 5 నెలలుగా ఉన్నది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) వెబ్‌సైట్‌పై అందుబాటులో ఉన్న హ్యాండ్‌బుక్‌లోని మార్గదర్శకాల ప్రకా రం.. ఒకవేళ మీకు (ఉద్యోగికి) రెండు యూఏఎన్లు జారీచేస్తే చివరిగా వచ్చినదాన్ని అలాగే ఉంచుకోవాలి. మొదటిదాన్ని రెండోదాంట్లో విలీనం చేసుకోవాలి. పీఎఫ్ బ్యాలెన్స్ బదిలీకి యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌పై ఫామ్ 13ను దాఖలు చేయాలి. ఇందుకు మీరు కొనసాగించదల్చిన యూఏఎన్‌తో కేవైసీ అప్డేట్ కూడా అవసరం. ఇక ఈ సమాచారాన్ని మీరు గతంలో పనిచేసిన సంస్థల యాజమాన్యాలకు, ఈ-మెయిల్ ద్వారా ఈపీఎఫ్‌వో (uanepf@ epfindia.gov.in)కు అందించాల్సి ఉంటుం ది. ఈ సందర్భంగా మీకున్న రెండు యూఏఎన్లనూ అందులో పేర్కొనాల్సి ఉంటుంది. దీంతో సంబంధిత అధికారులు పరిశీలించి పాత యూఏఎన్‌ను బ్లాక్ (నిలుపుదల) చేసేస్తారు. రెండో యూఏఎన్ పనిచేస్తుంది.
మొదటి పీఎఫ్ ఖాతా నుంచి నగదు మొత్తాలను ఉపసంహరించుకోవాలంటే.. వరుసగా రెండు నెలలపాటు మీకు ఉద్యోగం లేకుండా ఉండాలి. అప్పుడే మీ పీఎఫ్ ఖాతాలోకి ఎలాంటి విరాళాలు పోవు. దీంతో సదరు ఖాతా నుంచి మీ అవసరాల నిమిత్తం పూర్తిగా నగదు మొత్తాలను తీసుకోవడానికి చట్ట ప్రకారం వీలుంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీలో రెండు నెలలుగా మీకు పీఎఫ్ కవరేజీ లేకున్నా కూడా నగదు మొత్తాలను వెనుకకు తీసుకోవచ్చు.
ఆదాయ పన్ను (ఐటీ) చట్టం 1961 నిబంధనల ప్రకారం పీఎఫ్ ఉపసంహరణలపై పన్నులు వర్తించవు. అయితే ఏ పీఎఫ్ ఖాతా నుంచి మీరు నగదును వెనుకకు తీసుకోవాలనుకుంటున్నారో.. ఆ ఖాతాలో పీఎఫ్ విరాళాలను జమ చేసిన సంస్థలో వరుసగా ఐదేండ్లు, అంతకంటే ఎక్కువకాలం మీరు పనిచేసి ఉండాలి. అప్పుడే పన్ను మినహాయింపులకు అర్హులు. ఒకవేళ కంపెనీలను మారినా ఒకే పీఎఫ్ ఖాతా అంతరాయం లేకుండా కొనసాగితే కూడా ఈ ఐదేండ్ల సీనియారిటీకి వచ్చిన ముప్పేమీ ఉండదు. ఇక మొదటి ఖాతా నుంచి రెండో ఖాతాలోకి మీ నగదు మొత్తాలను బదిలీ చేసుకుంటే.. అప్పుడు ఆ రెండింటి పరిధిలోగల సర్వీసు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఒక్కదాని కిందే పరిగణనలోకి తీసుకుంటారు. అలా ఐదేండ్ల కాలం దాటినైట్టెతే పన్నులు వర్తించవు. అయితే మీ పీఎఫ్ ఖాతాలో ఉన్న నగదు మొత్తాలకు మీ నుంచి విరాళాలు అందనప్పుడు ఏదైనా వడ్డీ సమకూరితే దానికి మాత్రం పన్నులు వర్తిస్తాయి.
వరుసగా 2 నెలలపాటు ఉద్యోగం లేకపోతే మొత్తం పీఎఫ్ సొమ్మును, ఒక నెల ఉపాధి కరువైతే 75 శాతం పీఎఫ్ మొత్తాలను తీసుకోవచ్చు. రెండు నెలల తర్వాత ఆ మిగిలిన 25 శాతాన్ని కూడా పొందవచ్చు. ఇక పెండ్లిళ్లు, ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం, మరమ్మతు, వైద్య అవసరాలు, చదువుల ఫీజుల నిమిత్తం కూడా కొద్ది మొత్తాల్లో పీఎఫ్ సొమ్మును తీసుకోవచ్చు. పదవీ విరమణ అనంతరం లేదా శాశ్వత అంగవైకల్యం బారినపడ్డా పీఎఫ్ సొమ్మును పూర్తిగా తీసుకోవచ్చు.