హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర బీజేపీ నేతలు కంగుతిన్నట్టు తెలిసింది. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై తమకు అనుకూలంగా కేంద్ర మంత్రి నుంచి ప్రకటన కోరుకుంటే, పౌరసరఫరాలశాఖ ద్వారా ఒక నోట్‌ను ముఖాన కొట్టారని బీజేపీ నేతలు నిట్టూర్చినట్టు సమాచారం. రైతుల నుంచి ఆగ్రహజ్వాలలు చవిచూసిన బీజేపీ నేతలు దిక్కుతోచని స్థితిలో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని కేంద్రాన్ని వేడుకొన్నట్టు సమాచారం.
నదీజలాల విషయంలో కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటన చేసిన మాదిరిగానే, ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత శాఖ మంత్రితో ప్రకటన చేయించాలని కోరినట్టు తెలిసింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రైతుల నుంచి ఎదురైన ప్రతిఘటనను కేంద్ర నాయత్వానికి వివరించి, ధాన్యం కొనుగోళ్లపై ప్రకటన చేయాలని మొరపెట్టుకొన్నట్టు తెలిసింది.
అయితే.. ఈ అంశంపై రెండుమూడ్రోజులు వేచి చూడాలనే సమాధానం వచ్చినట్టు తెలుస్తున్నది. చివరికి కేంద్ర పౌరసరఫరాలశాఖ పేరుతో కేవలం ఒక ప్రెస్‌నోట్ విడుదల చేశారు. దీనిపై అధికారికంగా ఏ శాఖ ముద్ర కానీ, అధికారి సంతకం గానీ లేదు. పైగా తెలంగాణ నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ బాయిల్డ్ రైస్ కొనేది లేదని స్పష్టం చేసింది. దీంతో కంగుతిన్న బీజేపీ నేతలు తలలు పట్టుకొంటున్నారు.