‘భారత్ మాతాకి జై’ ఈ స్లోగన్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ పదే పదే ఇస్తుంటారు. అమ్మవారిని తలుచుకోనిదే కాలు కూడా బయట పెట్టనని చెప్తారు. నుదుటున బొట్టుతో చూడటానికి బుద్ధిమంతుడిలా కనిపిస్తారు. సదాచార సద్గుణ సంపన్నుడే ఈయన కింద దిగదుడుపు అనేట్టు ఉంటారు. కానీ, ఆయన నోరు తెరిస్తే బెదిరింపులు లేదా ప్రజల మధ్య కులం, మతం పేరుతో వైషమ్యాలు సృష్టించే మాటలు. తండ్రిగా బండి సంజయ్‌ది ఆ దారి అయితే, ఆయన కుమారుడు సాయి భగీరథ్‌ది మరోదారి. ఇతగాడు మైనర్ బాలికలకు మద్యం తాగించి అత్యాచారం చేశాడనే ఆరోపణల్లో చిక్కుకున్నాడు. తండ్రి జ్ఞానం, శీలం గురించి మాట్లాడుతారు. కానీ ఆయనకు జ్ఞానం లేదని విమర్శలు ఉంటే, ఆయన కొడుకుకు శీలం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఆ మధ్య పోక్సో చట్టంపై బండి సంజయ్ మాట్లాడి తెగ వైరల్ అయ్యారు. దేశం కోసం, ధర్మం కోసం ముఖ్యంగా స్త్రీ జనోద్ధరణ కోసం ఆయనను మించిన పోరాటయోధులు లేరన్నట్టు ప్రసంగించారు. ఇప్పుడు స్వయంగా తన కొడుకుపై కేసు నమోదయ్యేసరికి కుడితిలో పడిన ఎలుకలా గిలగిలా కొట్టుకుంటున్నారు. అంతే కాదు, ‘నేను నిఖార్సైన బీజేపీ కార్యకర్తను, నా మీద వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు..నేను ధర్మాన్ని కాపాడుతాను’ అని ఆయన అంటున్నారు.
బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైతే పోలీసులు ఇప్పటివరకు బాధ్యుడిని అరెస్ట్ చేయలేదు! కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా సంజయ్, రాష్ట్ర హోం శాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి తమకున్న అధికారాన్ని ఉపయోగించి నేరస్థుడిని తప్పించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆ మధ్య పశ్చిమబెంగాల్లో జరిగిన అర్జీకర్ ఘటనలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై పెద్ద ఎత్తున పోరాటం చేసింది బీజేపీ. మరి ఇక్కడేమో తన కొడుకు చేసిన నేరానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయకుండా ధర్మాన్ని కాపాడుతానని అంటున్న బండి సంజయ్‌ని కాపాడుతున్నది స్వంత పార్టీనే.
ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి అనరాని మాటలను, జుగుప్సాకరంగా మాట్లాడారు బండి సంజయ్. కేటీఆర్‌పై లేనిపోని నిందలేశారు. అంతటితో ఆగకుండా కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై తన అనుచరగణంతో దాడి చేయించారు. సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇతరులపై కేసీఆర్ నిందలేయలేదు. తన గురించి ఎందరు ఎన్ని మాటలన్నా పట్టించుకోలేదు. స్పందించలేదు. ఎందుకంటే తనను నమ్ముకున్న ప్రజల కోసం పనిచేయాల్సి ఉన్నదని, తన బాధ్యత ఏమిటో బాగా తెలిసిన నాయకుడాయన. ఉత్తరాది దాష్టీకపు ఆలోచనలు ఇక్కడ అమలు చేయాలని బండి సంజయ్ తహ తహలాడుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ ఆత్మ కేసీఆర్ ఉన్నారనే విషయాన్ని బండి అండ్ కో మరచిపోవద్దు.
కేటీఆర్ రాష్ట్ర మంత్రిగా చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేశారు. హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ల గురించి చెప్పాల్సిన పనే లేదు. నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన తీరు తెలంగాణ ప్రజలకే కాదు, యావత్ దేశానికీ తెలుసు. కేవలం మాటలు తప్ప.. పనుల గురించి సోయి లేని బండి సంజయ్..కేటీఆర్‌ను దూషించటం దిగజారుడుతనానికి నిదర్శనం. ఇక రేవంత్ మాటల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. సంజయ్, రేవంత్‌రెడ్డి ఇద్దరు అనుచిత వ్యాఖ్యలు, దూషణలకు మారుపేర్లు.
-బోయినపల్లి సత్యవతి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు