న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: దేశంలో 18 ఏండ్లలోపు వినియోగదారులకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు భారత చట్టాలను, ముఖ్యంగా మైనర్ల విషయంలో పాటించేలా ప్రత్యేక చట్టాలను తీసుకువచ్చే విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. పిటిషనర్ తరఫున వాదించిన హెచ్ఎస్ పూల్కా, కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా 18 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా కంపెనీలతో చట్టబద్ధమైన ఒప్పందాలు చేసుకోరాదని, అటువంటి ఒప్పందాలను నివారించడానికి ప్లాట్‌ఫారాలు రక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు తెలిపారు.
అంతేకాకుండా కేవలం కంపెనీలను స్వచ్ఛందంగా బాలల భద్రతా చర్యలను పాటించమని కోరడానికి బదులుగా, సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం చట్టబద్ధంగా కట్టుబడి ఉండే నిబంధనలను రూపొందించడాన్ని ప్రభుత్వం పరిగణించాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఈ అంశాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిబంధన కేవలం మార్గదర్శకంగా మిగిలిపోకుండా చట్టబద్ధమైన బలాన్ని కలిగి ఉండాలని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు పిల్లలకు సంబంధించి భారతీయ చట్టాలను వాస్తవంగా పాటిస్తున్నాయా, లేదా అని కేంద్రం నిర్ధారించుకోవాలని జస్టిస్ బాగ్చి కోరారు.