Ban On Drones : వినాయక నిమజ్జనాలు, దసరా నవరాత్రుల నేపథ్యంలో ముంబై పోలీసులు (Mumbai police) కీలక ఆదేశాలు జారీచేశారు. భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ముంబై వీధుల్లో డ్రోన్లు (Drones), పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్‌తో నడిచే మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హాట్ ఎయిర్ బెలూన్లు ఎగురవేయడంపై నిషేధం విధించారు.
సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు మొత్తం 30 రోజులు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని అధికారులు వెల్లడించారు. వినాయక నిమజ్జనాలు కొనసాగుతుండటం, త్వరలో దసరా నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 6న గణనాథుడి నిమజ్జనం సందర్భంగా నగరంలో భారీ జనసమూహం ఉంటుందని, అందుకే నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెప్పారు.
ఇందులో భాగంగా పలు ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేసినట్లు తెలిపారు. డ్రోన్లు, పారాగ్లైడర్లు లాంటి ఎగిరే వస్తువుల ద్వారా ఎలాంటి విధ్వంసం జరగకుండా ఈ ఆంక్షలు విధించామని, వాటిని ఉల్లంఘించినవారు శిక్షార్హులు అవుతారని చెప్పారు.