Ghaati Movie | మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి విజయం తర్వాత చాలా రోజులకు వెండితెరపై మళ్లీ కనిపించిన అగ్ర కథానాయిక అనుష్క నటించిన తాజా చిత్రం ‘ఘాటీ'(Ghaati). ‘వేదం’, ‘గమ్యం’ వంటి గొప్ప చిత్రాలను రూపొందించిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా, విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచడంతో, అనుష్క ఖాతాలో మరో హిట్ చేరిపోతుందని అభిమానులు ఆశించారు. అయితే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్తో నడుస్తుంది. తాజాగా ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్లు చూసుకుంటే వరల్డ్ వైడ్గా రూ.5.33 కోట్లు వసూళ్లు చేసినట్లు తెలుస్తుంది. అనుష్క కెరీర్లో ఇవే తక్కువ కలెక్షన్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే రుద్రమదేవి విడుదలైన తొలి రోజే రూ.12 కోట్లు వసూళ్లను సాధించిన ఈ బ్యూటీ.. హారర్ జానర్లో వచ్చిన భాగమతి సినిమాతో తొలిరోజే రూ.11 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ రెండు రోజులు వీకెండ్ కావడంతో ఘాటికి కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని చిత్రయూనిట్ భావిస్తుంది. మరోవైపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 20 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేయాలని ట్రేడ్ వర్గాల అంచనా.