Iran | టెహ్రాన్, అక్టోబర్ 27: ఇజ్రాయెల్ వాయుసేన శనివారం తెల్లవారుజామున జరిపిన దాడుల్లో ఇరాన్ను భారీగానే దెబ్బతీసింది. ఈ దాడిలో తమ సైనికులు నలుగురు మరణించారని, రాడార్ వ్యవస్థకు నష్టం ఏర్పడిందని, మొత్తం మీద నష్టం పరిమితంగానే ఉందని ఇరాన్ ప్రకటించింది. అయితే వాస్తవానికి ఈ దాడిలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి తయారీ ఫ్యాక్టరీ నాశనం అయ్యి, భారీ నష్టం ఏర్పడిందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సౌదీ ఎలప్ న్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. ముఖ్యంగా ఖైబర్, కాస్సీమ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను శక్తివంతం చేయడానికి ఉపయోగించే భారీ ఇంధన మిక్సర్లపై ఇజ్రాయెల్ వాయు సేన విరుచుకుపడిందని తెలిపింది. దీంతో నాశనమైన ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి రెండేండ్లు పట్టవచ్చునని పేర్కొంది.
గాజాపై దాడి.. 22 మంది మృతి
ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ దళాలు ఆదివారం జరిపిన దాడిలో 22 మంది మృతి చెందారు. మృతులలో చాలామంది మహిళలు, పిల్లలు ఉన్నారని పాలస్తీనా అధికారులు తెలిపారు. ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు మూడో వారానికి చేరుకున్నాయి.
టెల్ అవీవ్లో ఉగ్రదాడి
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో ఒక ట్రక్కు బస్టాప్పై దూసుకువచ్చిన ఘటనలో ఒకరు మృతిచెందగా, 35 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయం సమీపంలో జరిగిన ఈ ప్రమాదం ఉగ్రదాడిగా అనుమానిస్తున్నామని, ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇలా ట్రక్కులతో ఉగ్ర దాడులు చేయడం పాలస్తీనియన్లు చాలాఏండ్లుగా చేస్తుండటంతో ఇందులో వారి ప్రమేయాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు.
ఎలా సత్తా చూపాలో అధికారులే నిర్ణయించాలి: ఖమేనీ
ఇజ్రాయెల్ దాడులపై ప్రతిదాడి చేస్తారా? అన్న ప్రశ్నపై ఇరాన్ చీఫ్ అయతుల్లా ఖమేనీ స్పందించారు. ‘ఇజ్రాయెల్ మాపై దాడిని అతిశయోక్తిగా చూపకూడదు. అలా అని తక్కువగా అంచనా వేయరాదు. ఇరాన్ ప్రజల శక్తిని, సత్తాను ఇజ్రాయెల్ పాలకులకు ఎలా చూపాలో, ఈ దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే చర్యలను ఎలా తీసుకోవాలో అధికారులే నిర్ణయించాలి’ అని పేర్కొన్నారు.
విషమంగా ఖమేనీ ఆరోగ్యం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 85 ఏండ్ల ఖమేనీ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో ఆయన వారసుడి ఎంపిక కోసం కసరత్తు మొదలైంది. ఇజ్రాయెల్ వాయుసేన దాడిపై ఇరాన్ ఎలా ప్రతీకారం తీసుకుంటుందో అని అనుకుంటుండగా, ఖమేనీ అనారోగ్యం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఖమేనీ రెండో కుమారుడు మొజతాబ ఖమేనీ (55)ని వారసునిగా ఎంపిక చేయనున్నారు. ఇరానీ రివల్యూషనరీ గార్డ్సు కార్స్స్ కూడా ఖమేనీ వారసుని ఎంపిక కోసం చూస్తున్నది.