బంజారాహిల్స్,జూన్ 3: సింగరేణి ఆస్తులు ధ్వంసం చేయాలని చెప్పారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును బంజారాహిల్స్ పీఎస్‌కు బదిలీ చేశారు. గతనెల 26న బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లిలోని సింగరేణి సంస్థ జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సింగరేణి ఆస్తులను కాల్చేయండి.. రైలు పట్టాలను కోసేయండి.. తదితర వ్యాఖ్యలు చేయడంపై బీఎన్ఎస్ 326(జీ),55,61(2), 351(3), 353 (1),(బీ), 152తో పాటు పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. గత శనివారం సుమన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా సుమన్ వ్యాఖ్యలు చేసిన తెలంగాణ భవన్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుండడంతో ఈ కేసును బుధవారం ఇక్కడికి బదిలీ చేశారు. దీంతో ఇక్కడ తాజాగా మరోసారి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణను చేపట్టారు.