హైదరాబాద్: రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ గణేశుడి (Balapur Ganesh) లడ్డూ మరోసారి భారీ ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌చేస్తూ వేలం పాటలో రూ.35 లక్షలకు కర్మాన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ దక్కించుకున్నారు. ఇది గతేడాదికంటే రూ.5 లక్షలు అధికం. 2024లో బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితికి చెందిన కొలను శంకర్ రెడ్డి రూ.30.01 లక్షలకు దక్కించుకున్నారు. బాలాపూర్ గణేశుడి ఊరేగింపు తర్వాత గ్రామంలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించారు. ఇందులో మొత్తం 38 మంది పాల్గొన్నారు. వారిలో ఏడుగురు స్థానికేతరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. లడ్డూవేలం తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా దశరథ గౌడ్ మాట్లాడుతూ.. 2019 నుంచి గత ఆరేండ్లుగా బాలాపూర్ గణేశుడి లడ్డూ కోసం ఎదురుచూస్తుండగా ఇప్పుడు లడ్డూ దక్కిందఅన్నారు. చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
లడ్డూ వేలానికి మొత్తం 38 మంది రూ.5 చెల్లించి తమ పేర్లను నమోదుచేసున్నారు. ఉత్సవ కమిటీ నిబంధనల మేరకు వేలంలో పాల్గొననున్న సభ్యులు ముందుగానే రూ.30.01 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లడ్డూ వేలం తర్వాత హుస్సేన్‌సాగర్ వైపు గణేశుడి శోభాయత్ర సాగనుంది. బాలాపూర్ నుంచి చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజేమార్కెట్, అబిడ్స్, లిబర్టీ చౌరస్తా మీదుగా హుస్సేన్‌సాగర్‌కు మొత్తం 16 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది.
1980లో బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఏర్పాటయింది. గత 31 ఏండ్లుగా లడ్డూ వేలం కొనసాగుతున్నది. 1994లో తొలిసారిగా లడ్డూ వేలం ప్రారంభించారు. తొలి ఏడాది రూ.450 ధర పలికిన లడ్డూ.. 2017లో రూ.15 లక్షలు దాటింది. 2020లో కరోనా కారణంగా బాలాపూర్ లడ్డూ వేలంపాట రద్దయింది. వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ కమిటీ.. గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నది. ఇప్పటివరకు కోటి 64 లక్షల 87 వేల 970లు ఖర్చు చేసినట్లు ఉత్సవ సమితి వెల్లడించింది.కాగా, భారత్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలాపూర్ గణేశుడికి చోటు దక్కింది.
1994లో కొలను మోహన్‌రెడ్డి- రూ.450
1995లో కొలను మోహన్‌రెడ్డి- రూ.4,500
1996లో కొలను కృష్ణారెడ్డి- రూ.18 వేలు
1997లో కొలను కృష్ణారెడ్డి- రూ.28 వేలు
1998లో కొలన్ మోహన్ రెడ్డి లడ్డూ- రూ.51 వేలు
1999 కళ్లెం ప్రతాప్ రెడ్డి- రూ.65 వేలు
2000 కొలన్ అంజిరెడ్డి- రూ.66 వేలు
2001 జీ. రఘనందన్ రెడ్డి- రూ.85 వేలు
2002లో కందాడ మాధవరెడ్డి- రూ.1,05,000
2003లో చిగిరినాథ బాల్ రెడ్డి- రూ.1,55,000
2004లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.2,01,000
2005లో ఇబ్రహీ శేఖర్- రూ.2,08,000
2006లో చిగురింత తిరుపతి- రెడ్డి రూ.3 లక్షలు
2007లో జీ రఘనాథమ్ చారి- రూ.4,15000
2008లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.5,07,000
2009లో సరిత- రూ.5,10,000
2010లో కొడాలి శ్రీదర్ బాబు- రూ.5,35,000
2011లో కొలన్ బ్రదర్స్- రూ.5,45,000
2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి- రూ.7,50,000
2013లో తీగల కృష్ణారెడ్డి- రూ.9,26,000
2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ.9,50,000
2015లో కొలన్ మధన్ మోహన్ రెడ్డి- రూ.10,32,000
2016లో స్కైలాబ్ రెడ్డి- రూ.14,65,000
2017లో నాగం తిరుపతి రెడ్డి- రూ.15 లక్షల 60 వేలు
2018లో తేరేటి శ్రీనివాస్ గుప్తా- రూ.16,60,000
2019లో కొలను రామిరెడ్డి- రూ.17 లక్షల 60 వేలు
2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు
2021లో మర్రి శశాంక్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్- రూ.18.90 లక్షలు
2022లో వంగేటి లక్ష్మారెడ్డి- రూ.24,60,000
2023లో దాసరి దయానంద్ రెడ్డి- రూ.27 లక్షలు
2024లో కొలను శంకర్ రెడ్డి- రూ.30.01 లక్షలు
2025లో లింగాల దశరథ గౌడ్- రూ.35 లక్షలు