కొన్ని నెలల క్రితం నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా ఓపెనింగ్ అంటూ హడావిడి చేసి, ఉన్నట్టుండి వాయిదా వేశారు. దానికి ఫిల్మ్ సర్కిల్స్‌లో రకరకాల కారణాలు వినిపించాయి. తొలి సినిమా డైరెక్టర్ అనుకున్న ప్రశాంత్‌వర్మ కూడా ఈ ప్రాజక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో మోక్షజ్ఞ తెరంగేట్రం వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మరోవైపు అభిమానులేమో బాలయ్య నటవారసుడి ఆగమనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యం ఎట్టకేలకు మోక్షజ్ఞ సినిమాకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
బాలకృష్ణ క్లాసిక్ ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా రూపొందనున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’ చిత్రం ద్వారా మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్నారు. బాలకృష్ణే ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందట. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు మాటలు రాస్తున్నట్టు వినికిడి. ఈ నెల చివరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరుగనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.