IND vs NZ : మ్యాచ్ ప్రారంభంలోనే మూడు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన భారత్‌ను శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. ఈ క్రమంలో 30వ ఓవర్ రెండో బంతికి రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (42) ఔటయ్యాడు. విలియమ్సన్ క్యాచ్ అందుకుని పటేల్‌ను ఔట్ చేశాడు.
అనంతరం శ్రేయాస్ అయ్యర్‌కు కేఎల్ రాహుల్ జతచేరాడు. శ్రేయాస్ అయ్యర్ కొంచెం దూకుడు పెంచి ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 75 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. దాంతో 35 ఓవర్ల ఆట ముగిసే సమయానికి అయ్యర్ 74 పరుగులతో, రాహుల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులతో ఉంది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు తీశాడు. కైల్ జామిసన్, రచిన్ రవీంద్రలకు తలో వికెట్ దక్కింది.
అంతకుముందు ఇన్నింగ్స్ మొదలవగానే శుభ్‌మాన్ గిల్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి తొలి వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. అప్పటికి టీమ్ స్కోర్ 15 పరగులు. ఆ తర్వాత 22 పరుగుల వద్ద రోహిత్ శర్మ (15) ఔటయ్యాడు. ఆ తర్వాత ఓవర్లోనే రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కూడా పెవిలియన్ బాటపడ్డాడు. దాంతో 35 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.